థర్డ్ వేవ్ కరోనాను సమిష్టిగా ఎదుర్కొందాం: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

థర్డ్ వేవ్ కరోనాను సమిష్టిగా ఎదుర్కొందాం: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

  • పాజిటివ్ బాధితులకు త్వరితగతిన వైద్యసేవలు అందేలా చూడాలి…
  • అన్ని పి హెచ్ సి లలో కోవిడ్ సేవలుఅందించేందుకు సిద్ధంకండి…
  • వ్యాక్సినేషన్ పక్రియను వేగవంతం చేయండి…
  • నివారణ చర్యల్లో నియోజక వర్గాన్ని ఆదర్శంగా నిలపాలి…
  • కరోనా నివారణ చర్యలపై నియోజక వర్గంలోని తహశీల్దార్, ఎంపిడి ఓ లు, ఏరియా ఆసుపత్రుల పర్యవేక్షకులు,పి హెచ్ సి వైద్యాధికారులుతో నిర్వహించిన టెలీ కాన్ఫెరెన్స్ లో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

ఆర్.బి.ఎం : థర్డ్ వేవ్ కరోనాను సమిష్టిగా ఎదుర్కొందామని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం రాయచోటిలోని తహసీల్దార్ కార్యాలయంలో కరోనా నివారణ చర్యలపై ఆయన నియోజక వర్గ పరిధిలోని తహశీల్దార్, ఎం పి డి ఓ లు, ఏరియా ఆసుపత్రుల పర్యవేక్షకులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు,పట్టణ ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులుతో మండలాల వారీగా , పి హెచ్ సి ల వారీగా టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకూ కరోనా కేసులు అధికమవుతున్నాయన్నారు.

పండుగ సందర్భంగా కూడా కేసులు అధికమయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో నియోజక వర్గ పరిధిలోని అధికారిక యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నియోజక వర్గ పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో మందులు, బెడ్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సిద్ధం చేసుకోవాలని ఆయన అధికారులుకు సూచించారు.

పాజిటివ్ శాతంపై ఆయన మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితులలో తప్ప ఇళ్లలోనే ప్రజలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత తదితర నివారణ చర్యలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించాలన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీ లలో పారిశుధ్యపు చర్యలు ముమ్మరం చేయాలన్నారు. తహసీల్దార్, ఎం పి డి ఓ లు వారి పరిధిలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల లోని కోవిడ్ సేవలపై నిత్యం పర్యవేక్షించాలన్నారు. వ్యాక్సినేషన్ పక్రియను విజయవంతం చేయాలన్నారు.

బూస్టర్ డోసును, 15-18 సంవత్సరాల వయస్సు వారికి ఇచ్చే వ్యాక్సిన్ లను కూడా విజయవంతం చేయాలని సూచించారు. జ్వరాలతో బాధపడుతున్న వారిపై ఆయన ఆరా తీశారు. పటిష్ట చర్యలతో , సమిష్టి కృషితో మొదటి, రెండవ విడతల కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, అదే స్ఫూర్తితో మూడవ విడతను కూడా ఎదుర్కొని నియోజక వర్గ ప్రజలకు తోడుగా నిలుద్దామన్నారు. కోవిడ్ తో ఇతర ప్రాంతాలకు రెఫర్ అయ్యే కేసులుకు త్వరితగతిన వైద్యం అందేలా కృషి చేస్తామన్నారు.

ర్యాపిడ్ కిట్లు కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాయచోటిలో ట్రూ నాట్ ల్యాబ్ ఏర్పాటుచేయాలని ఆయన రాష్ట్ర ఉన్నతాధికారులును ఫోన్ ద్వారా ఈ సందర్బంగా కోరారు. అధికారులు , సిబ్బంది తమ విధుల్లో మరింత వేగం పెంచాలని ఆయన కోరారు. ప్రతి గ్రామ సచివాలయంలో మినీ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాట్లకు చర్యలను ముమ్మరం చేయాలని ఆయన ఎంపిడిఓ లును సూచించారు. మాస్క్ లు, శానిటైజర్ల కొరత లేకుండా సిద్ధం చేసుకోవాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. కోవిడ్ నివారణకు అధికారుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను శ్రీకాంత్ రెడ్డి స్వీకరించి వాటిని అమలు పరుస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, తహశీల్దార్ సుబ్రమణ్యం రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ నరసింహ కుమార్, ఎం పి డి ఓ సురేష్, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు డా రెడ్డి మహేశ్వర రాజు, వైద్యాధికారులు డా సునీత రెడ్డి, డా రాధిక , మున్సిపల్ ఆర్ ఐ మల్లికార్జున, వైఎస్ఆర్ సిపి నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్, మండల బిసి నాయకుడు పల్లపు రమేష్, కొలిమి హారూన్, జాఫర్ అలీఖాన్, రియాజుర్ రెహమాన్, కో ఆప్షన్ అయ్యవారు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.