వరి రైతులకు న్యాయం చేయాల్సిందే.. వర్షాలు, తెగుళ్లతో దెబ్బతిన్న వరి పంట వివరాలు సేకరించాలి

rbm

వరి రైతులకు న్యాయం చేయాల్సిందే.. వర్షాలు, తెగుళ్లతో దెబ్బతిన్న వరి పంట వివరాలు సేకరించాలి

  • వ్యవసాయాధికారులతో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం రాయచోటి: వర్షాలు, సుడిదోమ, మువ్వకుళ్లు వంటి రోగాలతో భారీగా దెబ్బతిన్న వరి పంట నష్ట వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించాలని ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్ రెడ్డి వ్యవసాయాధికారులను ఆదేశించారు. శుక్రవారం రాయచోటిలోని తన కార్యాలయంలో ఏడీ శ్రీలత, ఏఓ దివాకర్, ఇతర అధికారులతో వరి రైతుల ఇబ్బందులపై చర్చించారు. రాయచోటి నియోజకవర్గ పరిధిలో సాగైన వరిపంటను తెగుళ్లు చుట్టముట్టగా వర్షాలు మరింత ఇబ్బందిని కలిగించి నష్టాల పాలు చేసినట్లు రైతులు వేదన చెందుతున్నారన్నారు. తాను కూడా లక్కిరెడ్డిపల్లె, రామాపురం ప్రాంతాలలో పంటలను పరిశీలించానని, వరిపంట బాగా దెబ్బతిన్నదని ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సూచించారు. నియోజకవర్గంలోని నష్టపోయిన ప్రతి రైతు వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదికలను తయారు చేయాలన్నారు.

భారీ విపత్తులు, ప్రమాదాల కారణంగా దెబ్బతిన్న వాటికి మాత్రమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఉన్నాయని ఇలా సుడిదోమ, మువ్వకుళ్లు, వర్షాలకు దెబ్బతిన్న వాటిని ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వదని వ్యవసాయాధికారులు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి సూచించారు. దీనిపై ఆగ్రహించిన శ్రీకాంత్ రెడ్డి వర్షాలు సమృద్ధిగా కురిసి అనుకూలంగా ఉండడంతో రైతులు కష్టపడి పంటలను సాగు చేశారన్నారు. అలాంటి రైతులకు పంటచేతికందకుండానే నష్టాల పాలవుతున్నారన్నారు. మానవతాదృక్పడంతో పాటు జరిగిన నష్టంపై పూర్తి స్థాయిలో అంచనాలు చేసి ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి నివేదిస్తే తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకు ఎంతో మేలు జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. వ్యవసాయాధికారులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి సోకుతున్న తెగుళ్లను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరించాలన్నారు. అలా చేయడం వలన ఇలాంటి నష్టాలు జరగవన్నారు. కావున క్షేత్రస్థాయిలోనే వ్యవసాయాధికారులు, సిబ్బందిని పంట పొలాలను ఎప్పటికప్పుడు పరిశీలించేలా చూడాలన్నారు.

వేరుశనగ విత్తనాలను త్వరితగతిన అందివ్వండి:
రబీ సీజన్‌కు సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న వేరుశనగపు విత్తనపు కాయలను వెంటనే పంపిణీ చేయాలని శ్రీకాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైన రైతులను గుర్తించి వారందరికీ సబ్సిడీపై అందించే విత్తనపుకాయలను అందివ్వాలన్నారు. పంపిణీలో చిన్న పాటి అవకతవకలు జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే రాగులు, కొర్రలు తదితర వాటిని కూడా ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న వివరాలను రైతులకు తెలియపరచాలన్నారు. మీ పరిధిలో సబ్సిడీపై ప్రొద్దుతిరుగుడు విత్తనాలను అందించే వీలుంటే ప్రయత్నించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏడిఏ శ్రీలత, మండల వ్యవసాయ శాఖ అధికారి దివాకర్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.