రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు.. జగన్‌కు ప్రత్యేక కానుక
హైదరాబాద్: బాలపూర్ వినాయకుడి లడ్డకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏడాది లడ్డను వేలం వేస్తారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు వచ్చి వేలంపాటలో ఈ లడ్డును దక్కించుకుంటారు. దీంతో బాలాపూర్ లడ్డుకు ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. బాలాపూర్ లడ్డుతో అన్ని విధాలా అదృష్టం కలసివస్తుందని భక్తులకు నమ్మకంగా మారింది. అందుకోసం వేలంలో లక్షలను వెచ్చించి లడ్డును భక్తులు సొంత చేసుకుంటారు. లడ్డూ ధర ఈ ఏడాది రికార్డు స్థాయిలో పలికింది. 18లక్షలా 90వేల రూపాయాలకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డిలు లడ్డును సొంతం చేసుకున్నారు. 2019లో జరిగిన వేలంలో రూ.17లక్షలా 60వేలు పలికింది. అయితే కరోనా కారణంగా గత ఏడాది వేలం పాటను రద్దు చేశారు. అయితే ఈ లడ్డును సీఎం జగన్‌కు కానుకగా ఇస్తానని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రకటించారు. జగన్‌కు కానుకగా ఇచ్చేందుకే లడ్డూ వేలంలో పాల్గొన్నానని తెలిపారు.
బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి 1980లో ఏర్పాటైంది. 1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం కొనసాగుతోంది. ఏటా దీని ధర లక్షల్లో పెరుగుతూనే ఉంది. 2016 నుంచి వేలం పాట అమాంతం రెట్టింపు అయింది. వచ్చే ఏడాది బాలాపూర్ లడ్డూ 20లక్షల మార్క్ చేరుకుంటుందని నిర్వహకులు చెబుతున్నారు. లడ్డూ వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును గ్రామాభివృధికి, సేవా కార్యక్రమాలకు బాలాపూర్ ఉత్సవ కమిటీ ఖర్చు పెడతుంది. ఈ డబ్బుతో గ్రామంలో పాఠశాలలు, రోడ్లు, దేవాలయాలకు వినియోగిస్తారు.