మావోయిస్ట్ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మృతి?

మావోయిస్ట్ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మృతి?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మావోయిస్ట్ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు తెలుస్తోంది. దండకారణ్యం పరిధిలోని బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఆయన మరణించినట్టు సమాచారం. ఆర్కే మృతిని పోలీసులు ధ్రువీకరించారు. అయితే మావోయిస్ట్ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఎనిమిది నెలలుగా ఆర్కే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది.

ఈ సీజన్‌లో ఆయన కరోనాబారిన పడి కోలుకున్నప్పటినుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారని టాస్క్‌ఫోర్స్‌ విభాగం ప్రత్యేక అధికారి ఒకరు చెబుతున్నారు. 2016 అక్టోబరు 24న ఏఓబీ కటాఫ్‌ ఏరియా పరిధిలోని రామ్‌గూడలో భారీ ఎన్‌కౌంటర్‌ ఆయన కాలికి గాయమైనట్లు తెలిసింది. ఆ తర్వాత ఆయన తీవ్రమైన ఆనారోగ్యానికి గురయ్యారని, చికిత్స తీసుకున్నాక ఏడాదిన్నరపాటు దండకారణ్యంలోనే విశ్రాంతి తీసుకున్నారని తెలిసింది.

చికిత్స పొందుతూ ఆర్కే మృతి చెందినట్లు సమాచారం. 2004లో నాటి పీపుల్స్‌వార్‌ పార్టీ ఏపీ ప్రభుత్వంతో రాజకీయ చర్చలకు సిద్ధమైనప్పుడు ఆర్కే వెలుగులోకి వచ్చారు. మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కేకు 4 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంతో అనుబంధం ఉంది. దేశవ్యాప్తంగా 85 దాడుల్లో కీలకపాత్ర పోషించినట్టు పోలీసుల అంచనా. 200 మంది పోలీసు ఎన్‌కౌంటర్లలో ఆయన పాత్ర ఉందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఆర్కే మృతిపై వచ్చిన వార్తలు తప్ప మాకు ఏ విషయం తెలియదని విరసం నేత కల్యాణరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.