ఆర్.బి.ఎం డెస్క్: రాగాకీయాల్లో పదవులు రాగానే అందరూ సంపాదనపై దృష్టి పెడుతారు. ఆ సంపాదన కోసం అనేక అడ్డదారులు తొక్కుతుంటారు. అధికార బలాన్ని ఉపయోగించి కోట్లను వెనకేసుకుంటున్నారు ప్రస్తుత రాజకీయ నేతలు. పైన చెప్పిన మాటలకు విరుద్ధంగా ప్రజల కోసం పనిచేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ఈయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే 25 ఏళ్లు పదవిలో ఉన్నారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆస్తి ఎంత అని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగవచ్చు. నర్సయ్యకు ఉన్న ఆస్తి రెక్కల కష్టం మాత్రమే. నర్సయ్య కున్న కొద్దిపాటి పొలం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు కార్లు లేవు బంగళాలు లేవు. ఇప్పటికీ ఆయన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం టేకుల గూడెం గ్రామంలోనే ఉంటున్నారు.
గుమ్మడి నర్సయ్య సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. సీపీఐ ఎంఎల్ (న్యూడెమెక్రసీ) పార్టీ తరపున ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు పోటీ చేశారు. 1983, 1985, 1989, 1999, 2004లో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. పదవిలో ఉన్నప్పుడు.. ఇప్పుడు కూడా హంగు, ఆర్బాటాలు లేకుండా ఓ సాదారణ జీవితం గడుపుతున్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారికి అండగా ఉంటున్నారు. ఖమ్మం ఎజెన్సీ ప్రాంతం నుంచి ఆయన హైదరాబాద్‌కు రావాలంటే రైల్లోనో బస్సులోనో వస్తారు. అసెంబ్లీకి ఆటోలో వచ్చేవారు. హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటే జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనం తింటారు.
ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వస్తే ఐదు నక్షత్రాల హోటల్లో బస చేస్తుంటారు. కానీ గుమ్మడి నర్సయ్య మాత్రం పార్టీ ఆఫీసులో ఉంటూ తన పనులను ముగించుకుని ఇల్లెందుకు వెళ్తారు. నియోజకవర్గాల పునర్విభజనతో రెండుసార్లు ఓడిపోయారు. అయినా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఓటమి చెవి చూసిన నేతలు పార్టీలు మారుతూ ఉంటారు. కానీ నర్సయ్య మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. ఆయనకు ఎమ్మెల్యే భృతి కింద వచ్చిన మొత్తాన్ని కూడా పార్టీకి ఇచ్చిన ఆదర్శజీవి నర్సయ్య. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అవినీతిని దరిచేరనివ్వని గొప్ప నాయకుడు. అవినీతి మరక అంటని నర్సయ్య ఎందరిలో ఆదర్శం.