వైఎస్ షర్మిల పాదయాత్రకు ముహూర్తం ఖరారు..

వైఎస్ షర్మిల పాదయాత్రకు ముహూర్తం ఖరారు..

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రాన్ని మొత్తం చుట్టేసేందుకు ఆమె ప్రణాళిక రూపొందించుకున్నారు. అక్టోబర్‌ 20న ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేవెళ్ల నుంచే ప్రారంభిస్తామని షర్మిల ప్రకటించారు. పాదయాత్రను తిరిగి చేవెళ్లలోనే భారీ బహిరంగ సభతో ముగిస్తామని తెలిపారు. దాదాపు 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. పాదయాత్రలోను నిరుద్యోగ వారంలో భాగంగా మంగళవారం దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. పాదయాత్రతో ప్రజా సమస్యలను తెలుసుకుంటామని, ప్రజలకు అండగా ఉంటూ వారికి భరోసా కల్పిస్తామని షర్మిల తెలిపారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల ముందు చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభించారు. ఏపీ, తెలంగాణలో ఆయన పాదయాత్ర సాగింది. అక్రమాస్తుల కేసుల్లో వైఎస్‌ జగన్‌ రిమాండ్‌ ఖైదీగా ఉన్నప్పుడు అక్టోబర్‌ 18న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించి ఇచ్ఛాపురం వరకు 3,112 కిలోమీటర్ల మేర నడిచారు. అదే తేదీని చేవెళ్లలో తన పాదయాత్ర ప్రారంభముహూర్తంగా నిర్ణయించారు.

చేవెళ్ల నియోజకవర్గానికి వైఎస్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. చేవెళ్ల నుంచి 2003లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో ఆయన 1,467 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్రతో రాజశేఖర్‌రెడ్డికి జనాదరణ లభించడమే కాకుండా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేయడం వల్ల ముఖ్యమంత్రి స్థానానికి ఎలాంటి పోటీ లేకుండా ఆయనే సీఎం కుర్చీలో కూర్చుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రభుత్వ కార్యక్రమాలు దాదాపుగా అక్కడి నుంచే ప్రారంభించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published.