నీట మునిగిన నాగోల్

హైదరాబాద్: భారీ వర్షాలు హైదరాబాద్‌ను ఇంకా వీడలేదు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా కాలనీలు నీటమునిగాయి. ఎక్కువగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా నాగోల్ ప్రాంతం మరోసారి నీటమునిగింది. అవసరం అయితే తప్ప ఎవ్వరు బయటికి రావొద్దని నాగోల్ ప్రజలకు అధికారులు హెచ్చరించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నాగోల్ చెరువు పూర్తిగా నిండిపోయింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరద పోటెత్తుతోంది. అయ్యప్ప కాలనీ, మమతా నగర్ కాలనీ, న్యూ వెంకటరమణ కాలనీ, సాయిరాం నగర్ కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో అయ్యప్ప కాలనీవాసులు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.

నగరంలో పోటెత్తిన వరదకు రోడ్లనై నీళ్లు నిలిచి బురదగా మారాయి. ఇసుక మేటలు వేసిన రహదారులపై ప్రయాణాలు చేస్తూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షం పడితే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వర్షానికి ఉస్మాన్‌గంజ్‌, ఎల్బీనగర్‌ రెయిన్‌బో ఆస్పత్రి, టోలిచౌకి, నదీంకాలనీ, పరేడ్‌ గ్రౌండ్‌ రోడ్‌, సుందరయ్య పార్కు, ఛేనంబర్‌, రామంతాపూర్‌ ధర్మకిరణ్‌ హోమియో ఆస్పత్రి, లక్డీకాపూల్‌, బంజారాహిల్స్‌ పీఎఫ్‌ ఆఫీస్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లపై మోకాలిలోతు నీళ్లు నిలవడంతో కొన్ని వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.