సికింద్రాబాద్ లో వంద కోట్లతో కొత్త అభివృద్ధి పనులు..

సికింద్రాబాద్ లో వంద కోట్లతో కొత్త అభివృద్ధి పనులు..

సికింద్రాబాద్, అక్టోబరు 19 : అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ కార్యకలాపాల నిర్వహణలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని నిత్యం అగ్ర స్థానంలో నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని, కొత్తగా రూ.102 కోట్ల మేరకు నిధులను వివిధ అభివృద్ధి పనులకు సాధించామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. బుధవారం సితాఫలమండీ లోని తన ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పద్మారావు గౌడ్ వివిధ అంశాల పై ప్రసంగించారు. విలేఖరులు, మీడియా ప్రతినిధులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలో ఒక్క ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీ కూడా లేని లోటును తీర్చి సితాఫలమండీ ప్రభుత్వ స్కూల్ లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీ లను ప్రారంభించి స్థానికుల దశాబ్దాల కలను నేరవేర్చగాలిగామని తెలిపారు. తరగతి గదులు లేని లోటును తీర్చేందుకు హై స్కూల్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ లకు కొత్త భవనాలను నిర్మించేందుకు వీలుగా ఆయా విభాగాల అధికారులను సమన్వయపరచి రూపొందించిన అంచనాల మేరకు రూ.29.75 కోట్ల మేరకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం జీ ఓ నెంబరు 226 ద్వారా విడుదల చేసిందని ప్రకటించారు. కొత్త భవనాల నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలన్న తన అభ్యర్ధన కు స్పందించి ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నిధులను మంజూరు చేసినందుకు తన పక్షాన, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన కృతఙ్ఞతలు తేలిపారు. ఈ నిధుల్లో హై స్కూల్ భవనాల నిర్మాణానికి 14.45 కోట్ల రూపాయలు, జూనియర్ కాలేజీ భవనాల నిర్మాణానికి 6.30 కోట్ల రూపాయలు, డిగ్రీ కాలేజీ భవనాల నిర్మాణానికి 9.00 కోట్ల రూపాయలు వినియోగిస్తారని, త్వరలోనే కొత్త భవనాల నిర్మాణం పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుపుతామని తెలిపారు. ఇక మెట్టుగూడ నుంచి ఆలుగడ్డ బావి మీదుగా చిలకల్గుడా ప్రధాన రహదారిలో రైల్వే బ్రిడ్జి (RUB) ట్రాఫిక్ రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని, ఈ బ్రిడ్జి ని విస్తరించాలన్న తమ సూచనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి రూ.30 కోట్ల మేరకు నిధులను మంజూరు చేసిందని తెలిపారు. సితాఫలమండీ-తార్నాకల మధ్య మనికేశ్వరి నగర్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ వల్ల రెండు వైపులా రాకపోకలు సాగించే వారు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రూ.20 కోట్ల ఖర్చుతో RUB నిర్మాణానికి ప్రతిపాదించామని, ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. లాలాపేట లో రూ.ఆరు కోట్ల ఖర్చుతో కొత్త స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పనులు ప్రారంభించామని, రూ.6.99 కోట్ల ఖర్చుతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం పనులకు ఆమోదం లభించిందని, అడ్డగుట్టలో రూ.2.25 కోట్ల ఖర్చుతో ఫంక్షన్ హాల్ ను నిర్మించే పనులను ప్రారంభించామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.