హుజురాబాద్ కాంగ్రెస్ టికెట్ స్థానిక నేతకే..?

హుజురాబాద్ కాంగ్రెస్ టికెట్ స్థానిక నేతకే అవకాశం..?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్ ముందే అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. మొదట ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన ఈటల రాజేందర్‌కు గట్టి పోటీ ఇచ్చారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడంతో అభ్యర్థి వేటలో కాంగ్రెస్ పడింది. ఈ అభ్యర్థి ఎంపికలో ఇప్పటివరకు ఆ పార్టీలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఇద్దరూ బీసీ సమాజికవర్గం కావడంతో కాంగ్రెస్ కూడా బీసీ అభ్యర్థినే ఎంపిక చేయాలని భావిస్తోంది. నియోజకవర్గ ఎన్నికల బాధ్యతను మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు కాంగ్రెస్‌ పార్టీ అప్పగించింది. ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఐదు మండలాల్లో పర్యటించి కాంగ్రెస్‌ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీ శ్రేణులతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. ఆ మేరకు ఆయన స్థానికులకే టికెట్‌ ఇవ్వాలని సూచించారు. తాను సేకరించిన అభిప్రాయాల నివేదికను దామోదర రాజనరసింహ అధిష్ఠానానికి నివేదించారు.

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ సమక్షంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ సమన్వయకర్తలు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, పార్టీ ముఖ్యులతో గాంధీభవన్‌లో గురువారం సమావేశం జరిగింది. ఈ భేటీలో హుజూరాబాద్‌ అభ్యర్థిపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. కొండా సురేఖ అభ్యర్థిత్వంపై మెజార్టీ నేతలు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే మందే చెప్పినట్లుగా దామోదర రాజనరసింహ స్థానికులకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో ఆయనకు నచ్చజెప్పడానికి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. అయితే ఈ చర్చంతా చూస్తుంటే హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ వైపే మోజార్టీ ఉన్నట్లు అర్థమవుతోంది.

కొండా సురేఖపై బరిలోకి దింపడానికి కారణం
తెలంగాణలో సార్వత్రిక ఎన్నిలక తర్వాత రెండుసార్లు ఉప ఎన్నికలు వచ్చాయి. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలిచారు. ఇక నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. అయితే ఇప్పుడు హుజురాబాద్‌ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుజురాబాద్‌లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. దీంతో అభ్యర్థి ఎంపికపై అన్ని సమీకరణలు పూర్తి చేసి అభ్యర్థి ప్రకటించాలని భావిస్తోంది. అందుకే సురేఖను రంగంలోకి దింపాలను మోజార్టీ కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. కొండా సురేఖ పద్మశాలి సామాజికవర్గానికి చెందినవారు కాగా ఆమె భర్త మురళి మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. ఈ రెండు సామాజికవర్గాలకు హుజురాబాద్ నియోజకవర్గంలో 55 వేల పైచిలుకు ఓట్లు ఉండడం కలిసివచ్చే అంశంగా కాంగ్రెస్‌ నేతలు భావించినట్లు సమాచారం.

ఈటల రాజేందర్‌ ముదిరాజ్‌ వర్గానికి చెందినవారు కాగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. నియోజకవర్గంలో ముదిరాజ్‌ల ఓట్లు 23,220 ఉండగా, యాదవ సామాజికవర్గానికి 22,150 ఓట్లు ఉన్నాయి. కొండా సురేఖను పోటీలో నిలిపితే మున్నూరు కాపు, పద్మశాలి రెండు సామాజికవర్గాల నుంచి ఓట్లు పొందే అవకాశం ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడ్డట్లు సమాచారం. హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా 20 నుంచి 30 వేల వరకు సంప్రదాయ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు ఫదిలంగా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అటు సురేఖ, మురళీ సామాజికవర్గాల ఓట్లు, ఇటు కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లపై కాంగ్రెస్ గంపెడాశతో ఉంది. మరి హుజురాబాద్‌లో ఏ పార్టీ జెండా ఎగురవేస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published.