కొండా సురేఖ అభ్యర్థిత్వంపై రెండుగా చీలిన పార్టీ

కొండా సురేఖ అభ్యర్థిత్వంపై రెండుగా చీలిన పార్టీ

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు తరచూ చెప్పే మాట. కాంగ్రెస్ నేతలను ఒక తాటిపై తీసుకురావడం చాలా కష్టమైన పని. ఇంకా చెప్పాలంటే స్వపక్షంలోనే విపక్ష పాత్ర వహిస్తూ ఉంటారు. ఒక్కొసారి ఒకరిపై మరొకరు శృతిమించి విమర్శలు చేసుకుంటారు. నేతల వ్యవహారాలను చక్కపెట్టడం ఆ పార్టీ అధిష్టానానికి తలకుమించిన భారంగా ఉంటుంది. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీలో నేతలు రెండుగా చీలి పోయారు. సీనియర్ నేతలు స్థానికులకే టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు. అయితే జూనియర్ నేతలు మాత్రం స్థానికేతరులకు అభిప్రాయపడుతున్నారు. 2023 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్థానికులకే హుజురాబాద్ టికెట్ ఇవ్వాలని సీనియర్ల స్పష్టం చేస్తున్నారు. సీనియర్ల అభ్యంతరాలతో అభ్యర్థి ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక బాధ్యతను మాజీఉపముఖ్యమంత్రికి దామోదరం రాజనరసింహకు అప్పగించారు. ఆయన కొన్ని రోజులుగా హుజురాబాద్‌లోనే మకాం వేశారు. నియోజకవర్గంలో మండలాల వారిగా నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. స్థానిక నేతలనే బరిలో దింపాలని అధిష్టానానికి రాజనరసింహ సూచించారు. ఆయనతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కూడా స్థానికులకే టికెట్ ఇవ్వాలని చెబుతున్నారు. అయితే మోజార్టీ నేతలు మాత్రం హుజురాబాద్ నుంచి కొండా సురేఖను రంగంలోకి దింపాలని చెబుతున్నారు. అందుకు ఆ నేతలు రాజకీయ సమీకరణలు, కులాల వారిగా ఓటు బ్యాంక్ లెక్కలను చూపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే హుజురాబాద్‌లో పోటీకోసం ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. అయితే పార్టీ నిర్ణయానికి స్పందన కనిపించడం లేదు. ఇప్పటివరకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదనే ప్రచారం జరుగుతోంది. దరఖాస్తు చేసేందుకు కొండా సురేఖ నిరాసక్తత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ కోరితేనే పోటీచేయాలనే యోచనలో సురేఖ ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఈ నెల 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 10న భట్టి విక్రమార్క, రాజనర్సింహ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా అభ్యర్థిని ఖారారు చేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని శ్రీనివాస్ ఆశాభావంతో ఉన్నారు. ఇక ఈటల రాజేందర్ మాత్రం గతంలో తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సానుభూతి తనను గెలిపిస్తాయని ఆశలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఎంపిక కోసమే కుస్తీ పడుతోంది.

Leave a Reply

Your email address will not be published.