యోగదా సత్సంగ సొసైటీ యొక్క స్థాపన దినోత్సవం..

యోగదా సత్సంగ సొసైటీ యొక్క స్థాపన దినోత్సవం..
క్రియాయోగ శాస్త్ర వ్యాప్తికి 105 సంవత్సరాలు.

ఆర్.బి.ఎం డెస్క్: భారతదేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక సంస్థలలో ఒకటి అయిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, వై.ఎస్.ఎస్. ను విస్తృతంగా ప్రశంసలు అందుకున్న ఒక యోగి ఆత్మకథ గ్రంథాన్ని రచించిన పరమహంస యోగానందగారు మార్చి22,1917న స్థాపించారు. దానికి నూరు సంవత్సరాల పైచిలుకు వారసత్వం ఉంది. సామాన్య జనబాహుళ్యానికి భారతదేశపు ఆధ్యాత్మిక బోధనలను వ్యాపింపజేసి, భగవంతుడితో వారికి గల అనుబంధాన్ని గాఢతరం చేసుకునేందుకు సత్యాన్వేషకులను సమర్థులుగా చేయడంలో మాత్రమే కాక, దేశవ్యాప్తంగా అనేక ధార్మిక ప్రణాళికలలోనూ కార్యక్రమాల్లోనూ నేరుగా సహకరిస్తూ వై.ఎస్.ఎస్. ఒక వినూత్నమైన మెచ్చుకోదగిన పాత్రను పోషించింది.

శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమతుల్యతను నిలబెట్టుకుంటూ సామరస్యంగా జీవించడమనే మార్గం — దీనిని యోగానంద జీ “యోగదా” పద్ధతి అని పిలిచేవారు — ద్వారా యువతకు శిక్షణ ఇవ్వడమనే బృహత్కార్యాన్ని చేపట్టినప్పుడు యోగానంద గారు ఒక యువ సన్యాసి మాత్రమే. ఆయన ప్రస్తుతం పశ్చిమ బెంగాలులో ఉన్న దిహికా గ్రామంలో అతి కొద్దిమంది విద్యార్థులతో ఒక పాఠశాలను 1917 లో ప్రారంభించారు. ఇలా చేస్తూ, ఆయన విశేషంగా ప్రభావవంతమైన ఆధ్యాత్మిక సంస్థగా తయారవబోయే వై.ఎస్.ఎస్. బీజాలను నాటారు. వై.ఎస్.ఎస్. కు సహసంస్థ అయిన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ను ఆయన అమెరికాను చేరిన తర్వాత 1920 లో స్థాపించారు. ఎస్.ఆర్.ఎఫ్. కు ప్రపంచవ్యాప్తంగా ధ్యాన కేంద్రాలు ఉన్నాయి; వై.ఎస్.ఎస్. మాదిరిగానే ఆ సంస్థ కూడా ఒక ప్రశంసనీయమైన ఆధ్యాత్మిక పాత్రను పోషిస్తోంది. స్వామి చిదానంద గిరి గారు వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. ల ప్రస్తుత అధ్యక్షులు.

భగవంతుడిని తెలుసుకునే మార్గాన్ని కనుగొనేందుకు చిత్తశుద్ధి గల సత్యాన్వేషకులను సమర్థులుగా తయారుచేసి వారికి మార్గదర్శనం ఇవ్వగల ముక్తినిచ్చే క్రియాయోగ బోధనలను వ్యాప్తి చేయుటకు ఒక సంస్థను ప్రారంభించమని యోగానందగారిని వారి గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు ప్రేరేపించారు; వారి ప్రోత్సాహం వలన వై.ఎస్.ఎస్. ప్రారంభించబడింది. అది కందిరీగ తుట్ట వంటిది కావచ్చునని తెలియడం వల్ల సంస్థను స్థాపించడానికి యువకులైన యోగానంద గారు మొదట్లో విముఖులుగా ఉన్నారు; కాని చివరకు తమ గురువుగారి ఆదేశాలను పాటిస్తూ ఒక చిన్న ఆధ్యాత్మిక అలను ప్రారంభించారు; అది చివరకు ఒక బ్రహ్మాండమైన కెరటంగా మారి అన్ని దేశాల తీరాలకు చేరింది.

వై.ఎస్.ఎస్. వారి ఆశయాలూ, ఆదర్శాలు వాటికవే ఎంతో విస్తారమైనవి, స్ఫూర్తి నిచ్చేవి; వాటిలో ఒకటి దిగువ ఇచ్చిన పదాలతో మొదలవుతుంది:
దేవుడితో వైయక్తికమైన అపరోక్షానుభూతి సాధించడానికి తోడ్పడే నిర్దిష్ట శాస్త్రీయ ప్రక్రియల పరిజ్ఞానాన్ని అన్ని దేశాల్లోనూ వ్యాప్తి చెయ్యడం.
తమ గురువుల వద్ద నుంచి గ్రహించి యోగానంద గారు ప్రతిపాదించిన జ్ఞాన బోధనలు క్రియాయోగ శాస్త్రం చుట్టూ పరిభ్రమిస్తాయి. వందలాది వై.ఎస్.ఎస్. ధ్యాన కేంద్రాలు భక్తులకు వెలుగు నిచ్చే దీప స్తంభాల వలె తోడ్పడతాయి, అవి భారతదేశ పటమంతా వెదజల్లబడి ఉన్నాయి.

రాంచీ, దక్షిణేశ్వర్, ద్వారాహాట్, నోయిడాలో ఉన్న వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో అనేకమంది సన్యాసులు, స్వచ్ఛంద సేవకులు నివసిస్తున్నారు; వారు వై.ఎస్.ఎస్. కార్యక్రమాలను నిర్వహించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను, సత్సంగాలను జరిపించడం, భక్తులకు సలహాలు ఇవ్వడం, ఇంట్లో చదువుకునే పాఠాలను, సాహిత్యాన్ని పంపిణీ చేయడం, అవసరమైనప్పుడు సహాయ కార్యక్రమాలను నిర్వహించడం, యోగానందగారి బోధనలను ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడే అనేక ఇతర కార్యక్రమాలను చేపట్టడం, ఇవన్నీ చేస్తూ మహా గురువుల సంస్థకు ప్రతినిధులుగా సేవలందిస్తున్నారు.

గురువుల జన్మదినోత్సవాలు, మహాసమాధి రోజుల వార్షికోత్సవాల సందర్భాలలో, ఇతర స్మారకోత్సవాలలోనూ ప్రత్యేకమైన సత్సంగాలు ఆన్ లైన్ లోనూ నేరుగానూ నిర్వహించబడుతున్నాయి. భక్తుల సంగమాలు (సమావేశాలు) కూడా క్రమం తప్పకుండా నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు వాటికి హాజరైన భక్తుల ఆర్తిని, భక్తిని, అవగాహనను పెంచుతాయి.

ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం 2017 లో వై.ఎస్.ఎస్. సంస్థ నూరు సంవత్సరాల వేడుకలలో, 2018 లో యోగానంద గారి 125 వ జయంతి వార్షికోత్సవాలో ఇంకా అనేక సందర్భాలలో వై.ఎస్.ఎస్. ను గౌరవించింది. యోగానందగారి జీవితాన్ని, ఆయన సాధించిన మహత్కార్యాన్ని గౌరవించడానికి భారత ప్రభుత్వం రెండు పోస్టల్ స్టాంపులను, ఒకటి 1977 లో మరొకటి 2017 లో విడుదల చేసింది.

పరమహంస యోగానందగారి బోధనలు భారతదేశమంతటా వేలకొలది భక్తులను ఆకట్టుకుని, స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి; వై.ఎస్.ఎస్. ఆయన వారసత్వపు సారం. వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. ద్వారా యోగానంద గారు జీవిస్తూనే ఉన్నారు. వాటి సుగంధ భరిత పరిమళం నిరంతరం వ్యాపిస్తూనే ఉంది. ఇంకా వివరాలకు: yssi.org

 

Leave a Reply

Your email address will not be published.