స్వామి శితికంఠానంద అనుగ్రహ భాషణంతో శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవాలు
ఆర్.బి.ఎం హైదరాబాద్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఆధ్వర్యంలో శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 14న ప్రత్యేకంగా జర్నలిస్టుల కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యానగర్‌లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉదయం 9:30 నుంచి 1:30 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. స్వామి వివేకానంద స్ఫూర్తితో స్వాతంత్ర్య ఉద్యమంలో దేశ ప్రజలను తన బోధనలు, కార్యాచరణతో ఎంతగానో ప్రభావితం చేసిన శ్రీ అరబిందో గురించి మరెన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు అరుదైన అవకాశం ఇదని నిర్వాహకులు తెలిపారు. జర్నలిస్ట్ మిత్రులందరూ స్ఫూర్తి పొందాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ టీమ్ తెలిపింది.
హైదరాబాద్ రామకృష్ణ మఠానికి చెందిన స్వామి శితికంఠానంద అనుగ్రహ భాషణంతో కార్యక్రమం ప్రారంభం కానుంది. సీనియర్ జర్నలిస్టులు గోపరాజు నారాయణ రావు, వల్లీశ్వర్, శ్రీనివాసకుమార్, అవునూరి సాయికృష్ణ, జైసింహ, అరబిందో సొసైటీకి చెందిన ములుగు శ్రీనివాస్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరూప్ రెడ్డి, తదితరులు ప్రసంగిస్తారు. జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ టీమ్ పిలుపునిచ్చింది.