రేపు తెలంగాణలో ముగియనున్న ‘భారత్ జోడో యాత్ర’

హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘భారత్ జోడో యాత్ర’ రేపటితో తెలంగాణలో ముగుస్తుంది. రేపు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు మేనూరులో రాహుల్‌ వీడ్కోలు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఎవరెన్ని సమస్యలు సృష్టించినా రాష్ట్రంలో రాహుల్‌ పాదయాత్ర విజయవంతం చేశామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. సీబీఐ, ఈడీ దాడులు, ప్రాణభయం లేకుండా రాహుల్‌ పాదయాత్ర చేశారని కొనియాడారు. కేసీఆర్ అవినీతితో తెలంగాణ కుళ్లి, కృశించిపోయిందని దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో దేశం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే లక్ష్యంతో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగనుంది. అక్టోబర్ 23న తెలంగాణలోకి జోడో యాత్ర ప్రవేశించింది. తెలంగాణాలో సుదీర్ఘంగా 16 రోజులపాటు పాదయాత్ర సాగింది. 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగుతుంది. జోడో యాత్ర తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహాన్ని నింపింది. నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించనుంది.

Leave a Reply

Your email address will not be published.