మునుగోడులో టీఆర్‌ఎస్,  బీజేపీకి కలవరపాటు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య రసవత్తర పోటీ నడుస్తోంది. ప్రతి రౌండ్‌లో ఉత్కంఠ నెలకొంది. ఓ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇస్తుంటే.. మరో రౌండ్‌లో బీజేపీకి టీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇస్తోంది. అన్ని రౌండ్ ముగిసేవరకు ఎవరు గెలుస్తారో.. ఎవరు గెలుస్తారో అనేది ఊహాకు కూడా చిక్కడం లేదు. ఓ రకంగా చెప్పాంటే టీ 20 క్రికెట్ మ్యాచ్‌లాగా ఉప ఎన్నిక ఫలితాలున్నాయి. మునుగోడు నియోజకవర్గంలోనే మండలం చౌటుప్పల్ అత్యధిక ఓటర్లు ఉన్నాయి. ఇదే మండలానికి చెందిన రాజగోపాల్‌రెడ్డికి భారీ ఓట్లు పోలవుతాయని బీజేపీ నేతలు అంచానా వేశారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికి చౌటుప్పల్‌ మునిసిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రాజగోపాల్‌రెడ్డికి ఆదరణ ఉన్న మాట వాస్తవం. కానీ అనూహ్యంగా చౌటుప్పల్ మండలంలో బీజేపీకి మెజార్టీ రాలేదు. టీఆర్‌ఎస్ స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. చౌటుప్పల్ మండలంలో బీజేపీని ఆశించిన స్థాయిలో ఓటర్లు ఆదరించలేదని స్పష్టమైంది. దీంతో రాజగోపాల్ రెడ్డి నిరాశ చెందారు. ఇక టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత ఊరిలో ఆయనకు ఓటర్లు షాకిచ్చారు. ప్రభాకర్‌రెడ్డి సొంత గ్రామం లింగవారిగూడెంలో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి ఇన్‌చార్జ్‌లుగా ఉన్న గ్రామాల్లో కూడా బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. ఐదు రౌండ్లు ముగిసేసరికి ఫలితాలను చూస్తే టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో మాత్రమే గట్టెక్కే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published.