మర్పల్లి తహసీల్దార్‌పై రైతు దాడి

మర్పల్లి: ఏళ్ల తరబడి కబ్జాలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్న భూమిని తహసీల్దార్‌ వేరే వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేయడంతో ఆగ్రహించిన ఓ రైతు ఏకంగా ఆ అధికారిపై దాడికి దిగాడు. మర్పల్లి మండల పరిధిలోని పిల్లిగుండ్ల గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌ 54, 60లో 32 ఎకరాల వ్యవసాయ భూమి కలదు. కొన్నేళ్లుగా పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన రైతులతో పాటు మోమిన్‌పేట మండలం అమ్రాదిఖుర్ధు గ్రామానికి చెందిన రైతులు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో ఆ భూములు మావేనంటూ, చట్టపరమైన రికార్డులను చూపించి ఎండీ గౌసోద్దీన్‌, రైమోద్దీన్‌, ఎండీ ఖాద్రీ మోయినోద్దీన్‌లు ఆ భూములను వారి పేరిట మార్చుకున్నారు. దీంతో బాధిత రైతులు గతంలోనే తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో శుక్రవారం మోమిన్‌పేట మండలం అమ్రాదిఖుర్ధు గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే రైతు తహసీల్దార్‌ శ్రీధర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కబ్జాలో ఉండగా ఇతరుల పేరిట భూమిని ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తారని కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్‌ చొక్కా పట్టుకుని దాడికి పాల్పడ్డాడు. వెంటనే కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో లక్ష్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. విధులకు ఆటంకం కలిగించినందుకు లక్ష్మయ్యపై కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published.