ఐబీఎస్‌ కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. వేగంగా స్పందించిన కేటీఆర్

చేవెళ్ల: జూనియర్‌ విద్యార్థుల మధ్య ఘర్షణ చిలికిచిలికి గాలివానలా మారి పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పీఎస్‌ పరిధిలోని దొంగన్‌పల్లి గ్రామ శివారులో గల ఈక్పాయ్‌ బిజినెస్‌ స్కూల్‌ (ఐబీఎస్‌) కళాశాలలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐబీఎస్‌ కళాశాల లా ఫస్టియర్‌లో చేరిన ఓ విద్యార్థితో తోటి విద్యార్థి ఘర్షణకు పడ్డాడు. పిడిగుద్దులు గుద్దడంతో పాటు నోట్లో, ముఖంపై పౌడర్‌ చల్లి తీవ్రంగా కొట్టడంతో విద్యార్థి భయపడి తల్లిదండ్రులకు సమాచారం అందజేశాడు. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి వారి బాబును స్వస్థలానికి తీసుకెళ్లారు. అయితే గాయాలపాలైన విద్యార్థి మిత్రులు విషయాన్ని తెలుసుకొని ముందుగా కొట్టిన విద్యార్థిని చితకబాదారు. దీంతో ఈ విషయం కాస్త శంకర్‌పల్లి పోలీసులకు చేరింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు పలిపించుకుని  ఇరువురిని పోలీసుల సమక్షంలోనే మందలించి ఎలాంటి కేసులు వద్దు అంటూ క్షమాపణ చెప్పించి విద్యార్థులను తీసుకెళ్లారు. కళాశాలలో జరిగిన ర్యాగింగ్‌ వివాదంపై విద్యార్థి తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఫిర్యాదు చేయగా మంత్రి వెంటనే స్పందించారు. ఈ విషయమై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రను ఆదేశించినట్లు  తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.