‘కళాపోషకులు’ మూవీ రివ్యూ..

‘కళాపోషకులు’ మూవీ రివ్యూ..

బ్యానర్ : శ్రీ వెన్నెల క్రియేషన్స్
నిర్మాత, స్టొరీ : సుధాకర్ రెడ్డి. ఎమ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ : చలపతి పువ్వుల
నటీనటులు : విశ్వకార్తికేయ, దీప ఉమాపతి, భాష, చైతన్య, చిన్ను
కెమెరామెన్ : కళ్యాణ్ సమి
ఎడిటర్ : సెల్వ కుమార్
సంగీతం : ఎలేందర్ మహావీర్
డిజైన్ : గణేష్
పీఆర్ఓ : సాయి సతీష్ పాలకుర్తి

టాలెంట్ ఎవడి సొత్తూ కాదు.. నటించాలనే జిల్ ఉంటే చాలు.. సక్సెస్ నీదే. ఇలా నటనపై మక్కువతో ఎంతో మంది నటీనటులు సినిమాల్లోకి వచ్చి తామేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు. అలా వచ్చిన వారే యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వకార్తికేయ, దీప ఉమావతి. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై యువ దర్శకుడు చలపతి పువ్వల ద‌ర్శక‌త్వంలో.. టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి. ఎమ్ నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘కళాపోషకులు’. యు/ఎ సర్టిఫికెట్ సాధించి జనవరి-29న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఇంతకీ సినిమా కథేంటి..? ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్ ఎలా ఉంది..? కథకు ప్లస్ పాయింట్స్ ఏంటి..? మైనస్ పాయింట్స్ ఏంటి..? అనేవి ఈ రివ్యూలో చూద్దాం.

‘కళాపోషకులు’ కథ.. :-
మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన భాను (విశ్వకార్తికేయ) డబ్బులున్న అమ్మాయిని లవ్ చేసి లైఫ్‌లో సెటిల్ అవ్వాలని వెతుకుతుంటాడు. ఇందుకు తన కాలేజీలో చదువుకునే అమ్మాయిలందరి గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. తన మిత్రుడు, కాలేజ్ అటెండర్ సహాయంతో అమ్మాయిల బయోడేటా అంతా వెతికి ఫైనల్‌గా ప్రీతి అనే ఒక అమ్మాయిని (హీరోయిన్ దీప ఉమాపతి) ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు. ఆ అమ్మాయి బాగా రిచ్. ప్రీతికి బంధువులు, ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు. తల్లి చనిపోగా.. తండ్రి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటాడు. ఇంట్లో టెన్షన్‌తో హీరోయిన్ రోజూ మద్యానికి అలవాటు పడుతుంది. అలా ఒక రోజు డ్రింక్ చేస్తుండగా ప్రీతిని హీరో చూస్తాడు. ‘వామ్మో.. నేను ఏదో అనుకుంటే ఈ అమ్మాయేంటి ఇలా ఉంది..’ అని హీరో.. ‘బావ వర్కవుట్ అవ్వదు.. మనకు అస్సలు సెట్ అవ్వదు’ అని ఫ్రెండ్స్ అనుకుంటారు. అయినా సరే అమ్మాయి రిచ్ కనుక నేను లవ్ చేసి తీరుతానంటూ ముందుకెళ్లి.. అమ్మాయిని ఫాలో అవుతూ చివరికి ఏదో ఒకలా ప్రేమిస్తాడు. ఈ టైమ్‌లోనే ప్రీతి తండ్రి హఠాత్తుగా చనిపోతాడు. అసలు ఆయన ఎందుకంత సడన్‌గా చనిపోయాడు..? ఆయన చావుకు కారణమెవరు..? భాను-ప్రీతి లవ్‌లో పడ్డాక ఏం జరుగుతుంది..? లైఫ్‌లో సెటిలైపోయాం అనుకుంటున్న టైమ్‌లో హీరోకు ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది..? ఇంతకీ ఆ విషయమేంటి..? ఆ సమస్యను ఎలా పరిష్కరించుకుని ముందుకెళ్లాడనేది..? తెలియాంటే థియేటర్‌కు వెళ్లి చూడాల్సిందే.

విశ్లేషణ :-
ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నిర్మాత సుధాకర్ రెడ్డి మరీ ఎక్కువగా బడ్జెట్ పెట్టకుండా.. అలా అని తక్కువగాను లేకుండా పెట్టాల్సినంత మాత్రమే బడ్జెట్ పెట్టాడు. ఎక్కడా తడబాటు అనేది లేకుండా సరైన దర్శకుడ్ని.. నటీనటులను ఎన్నుకొని నిర్మాత సినిమాను పండించాడు. డైరెక్షన్ విషయానికొస్తే.. చలపతి తాను అనుకున్నది తెరకెక్కించాడు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ మొత్తం అన్నీ తానై కథను ముందుకు నడిపించాడు. కొత్త డైరెక్టరే అయినప్పటికీ దర్శకత్వ లక్షణాలు మంచిగానే ఉన్నాయి. ఫస్టాప్‌లో అంతగా విషయం లేకపోయినప్పటికీ.. సెకాండాఫ్ మాత్రం మంచి ట్విస్ట్‌తో ఇంట్రెస్టింగ్‌గా అభిమానులను ముందుకు తీసుకెళ్లాడని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని కొన్ని చోట్ల అనవసరపు సీన్లు ఉన్నాయి. ఆ సీన్లతో మరీ ‘ల్యాగ్’ అనిపిస్తోంది. డైలాగ్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సాంగ్స్ బాగున్నాయ్. ‘నువ్వేలే.. నువ్వేలే..’ అనే సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ‘అన్‌లిమిటెడ్ వండర్’ అనే ఐటమ్ సాంగ్ ప్రేక్షకుల్లో కాస్త ఊపు తెప్పిస్తుంది. ఎలేందర్ మహావీర్ సంగీతం అదరగొట్టేశాడు. మరీ ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్. ఈ సినిమా మొత్తానికి సంగీతమే హైలైట్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక నటీనటుల విషయానికొస్తే.. ఎవరి పాత్రకు వాళ్లు న్యాయం చేశారు.. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ ‘కళాపోషకులే..’.

నటీనటుల గురించి..!? :-
హీరో, హీరోయిన్ ఇద్దరూ బాగా నటించారు. వీరిద్దరికీ మంచి ఫ్యూచర్ ఉంది. సినిమా చూసిన సదరు ప్రేక్షకుడికి భాను-ప్రీతిని ఇంకా చూపించుంటే బాగుండేదనిపిస్తుంది. ఇక హీరో ఫ్రెండ్స్ ఇద్దరూ ఫర్లేదు అనిపించారు. ప్రిన్సిపాల్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి సెంటిమెంట్స్, కామెడీ బాగున్నాయ్. భానుకు నాన్నమ్మగా నటించిన రాములమ్మ నోరు తెరిస్తే కామెడీనే. ఈమె పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సినిమా మొదట్నుంచి.. చివరి వరకూ నవ్వులు పూయించింది. ‘పచ్చళ్లు చేయాల్సిందే..’ అంటూ అందర్నీ నవ్విస్తుంటుంది. ఇక కమెడియన్ అనంత్ బాబు గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. పెదరాయుడి గెటప్‌లో ‘గంట మాస్టర్’ మాటకు ముందు గంట.. మాట తర్వాత గంట.. ఇలా క్రమశిక్షణతో అందర్నీ కడుపుబ్బా నవ్వించాడు. ఇందులో ఇద్దరూ డాక్టర్ పాత్రదారులు ఉండగా.. ఒకరేమో కన్నింగ్.. ఇంకొకరేమో కన్‌సర్న్ చూపిస్తుంటారు. జెమినీ సురేష్ యాక్టింగ్ బాగుంది.. ఆయనకిచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. ఇక మిగిలిన నటులు భాష, చైతన్య, చిన్ను, జ్వాల, జబర్దస్త్ నవీన్ తదితరులు బాగా నటించారు. జబర్దస్త్ నవీన్ ఈ సినిమాలోనే ఫస్ట్ టైమ్ ఇలా విలన్ క్యారెక్టర్‌గా నటించాడు. ఆయన యాక్టింగ్ ఫర్లేదు.. మున్ముంథు కూడా కామెడీతో కూడిన విలన్ పాత్రలకు తీసుకోవచ్చు. ఇలా ఎవరికిచ్చిన పాత్రలకు వాళ్లు న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. అన్నీ ఉన్నప్పటికీ ఏదో లేని లోటు మాత్రం సినిమాలో కనిపిస్తోంది. కెమెరా వర్క్, ఎడిటింగ్ అంతా బాగున్నాయ్.

ప్లస్, మైనస్ పాయింట్స్ ఇవీ.. :-
సినిమాకు హీరో, హీరోయిన్ నటన.., సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్.., రాములమ్మ, గంట మాస్టర్‌ల కామెడీ. ప్రొడక్షన్ వాల్యూస్, ‘నువ్వేలే.. నువ్వేలే..’ అనే సాంగ్ ఇవన్నీ ప్లస్ పాయింట్స్. డైరెక్టర్ ఇంకాస్త తన ఆలోచనలకు, క్రియేటివిటీకి పదునుపెట్టుంటే బాగుండేది. సినిమాలో కొన్ని కొన్ని అనవసరపు సీన్లు ఉన్నాయ్. కామెడీ బాగానే ఉంది కానీ.. పాత సినిమాల్లోని కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకొని దాన్నే కామెడీ, పాటగా చిత్రీకరించాడు. అలా కాకుండా తనలోని క్రియేటివిటీని ఇంకాస్త బయటపెట్టుంటే బాగుండేది అనిపిస్తోంది. ఒకటి, అర మైనస్ పాయింట్స్ మినహా.. మొత్తంగా సినిమా బాగానే ఉంది.

రేటింగ్ : 3/5
ట్యాగ్‌లైన్ : అందరూ ‘కళాపోషకులే..’

Leave a Reply

Your email address will not be published.