ముంబైలో బతకలేకపోతున్నా: వరవరరావు

ముంబైలో బతకలేకపోతున్నా: వరవరరావు

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఎల్లార్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న విరసం నేత వరవరరావు తనకు కోర్టు మంజూరు చేసిన మెడికల్ బెయిల్‌ను పొడగించాలని ముంబై హైకోర్టును ఆశ్రయించారు. వరవరరావుకు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈఏడాది ఫిబ్రవరి 22న ముంబై హైకోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసిన సమయంలో కోర్టు ఆయనకు కొన్ని షరతులు విధించింది. బెయిల్‌పై ఉన్నన్ని రోజులు ముంబై ఎన్‌ఐఏ కోర్టు పరిధిలోనే నివసించాలని నిర్దేశించింది. దీంతో ఆయన గత ఆరు నెలలుగా ముంబైలోనే ఉంటున్నారు. అయితే ముంబైలో వైద్య ఖర్చులను భరింలేక పోతున్నానని, తెలంగాణ రాష్ట్రంలోని తన స్వంత ఇంట్లో ఉండి వైద్యం చేయించుకుంటానని కోర్టును ఆయన అభ్యర్థించారు. తన ఆరోగ్యం ఇంకా కుదటపడలేదని చెప్పారు. ముంబై హైకోర్టు విధించిన షరతులను తాను ఉల్లంఘించలేదని ఆయన బెయిల్ కోసం వేసుకున్న పిటిషన్‌లో పేర్కొన్నారు. 84 ఏళ్ల వయసున్న తాను.. 72 ఏళ్ల వయసున్న భార్యతో కలిసి ఇంటికి దూరంగా ముంబై మహానగరంలో ఉంటున్నానని పిటిషన్‌లో తెలిపారు. వరవరరావు పిటిషన్‌ను ముంబై హైకోర్టు పరిశీలించింది. సెప్టెంబరు 6న (సోమవారం) వాదనలను వింటామని న్యాయస్థానం పేర్కొంది. మహారాష్ట్ర పుణె జిల్లాలోని భీమా కోరెగావ్‌లో 2018 జనవరి 1న హింసచెలరేగింది. 200 ఏళ్ల కింద భీమా కోరేగావ్ యుద్ధాన్ని స్మరించుకునేందుకు దళితులు సభను ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన అల్లర్లలో ఒకరు మృతి చెందారు. ఈ ఘర్షణలో పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు. ఈ కేసులో మావోయిస్టులకు సంబంధాలున్నాయన్న ఆరోపణలతో వరవరరావును 2018 నవంబర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published.