కేసీఆర్‌గారూ.. ఆంధ్రకు జరిగిన అన్యాయం గురించి అడగండి: ఉండవల్లి అరుణకుమార్
ఆర్.బి.ఎం రాజమహేంద్రవరం: సీఎం కేసీఆర్ ఇక ఆంధ్రకు జరిగిన అన్యాయం గురించి కూడా అడగాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కోరారు. అన్యాయం చేసిన వాడికి ఎప్పుడూ న్యాయం జరగదన్నారు. బిజెపిపై పోరులో ఆంధ్రను కూడా కలుపుకోండని ఆయన సూచించారు. గతంలో సీఎం మమతా బెనర్జీ, శరద్‌యాదవ్, ములాయం సింగ్ యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించారని గుర్తుచేశారు. మరి వారితో మీరు మాట్లాడుతున్నారు కదా? అని ప్రశ్నించారు. దీనిని కూడా దేశవ్యాప్తంగా చర్చకు పెట్టాలన్నారు. ఆంధ్రలో కూడా మీకు అభిమానులు వస్తారని తెలిపారు. ప్రస్తుతం జగన్, వైసీపీ నేతలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి మంచి చేయాలనే ఆలోచనతో టీడీపీతోపాటు అన్ని పార్టీలు కలసి వస్తాయని, మనకు ఇచ్చిన హామీలు నెరవేరాలని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.