ఆయన చేయలేనిది సీఎం జగన్ చేస్తున్నాడని బాబుకి కడుపు మంట: శ్రీకాంత్ రెడ్డి.
ఆర్.బి.ఎం తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీటింగుల్లో స్ట్రాటజీ ఉండదని, అర్థం లేకుండా మాట్లాడుతుంటాడని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడంపై ఏమీ పాలుపోక విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. దివంగత ఎన్టీఆర్‌పై అంత ప్రేమ ఉన్న వ్యక్తి తాను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లా వాసులకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ పేరు పెట్టారని స్పష్టం చేశారు. దాన్ని కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నాడని గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్, అన్నమయ్య, సత్యసాయి లాంటి వారు ఒక్క ప్రాంతానికి పరిమితమైన వారు కాదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వారికి గుర్తింపు ఉందని, వారిని గౌరవించుకోడానికే ప్రభుత్వం ఆ పేర్లు పెట్టిందని తెలిపారు. దాంట్లోనూ చంద్రబాబు రెచ్చగొట్టే ధోరణి విడనాడలేదని, ఏదన్నా తాను చేయలేనిది సీఎం జగన్ చేస్తున్నాడని బాబుకి కడుపు మంటగా ఉందని దుయ్యబట్టారు. ఒక్కసారి ఆయన గురించి ఎన్టీఆర్ ఏమన్నాడో చంద్రబాబు వీడియోలు చూసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు వంటి ద్రోహి ఎవ్వరూ లేరని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.
అదే విధంగా ఉద్యోగుల సమస్యకు, జిల్లాల పునర్వవస్తీకరణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడూ రెచ్చగొట్టే ప్రయత్నాలే చేస్తారని, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని తాము చెప్తూనే ఉన్నామని పేర్కొన్నారు. చర్చల కోసం ఉద్యోగులు రాకపోతున్నా కమిటీ సభ్యులు వేచి చూస్తున్నారని, సమస్య ఏదైనా చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అలాంటిది ఉద్యోగుల సమస్య పక్కదోవ పట్టించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.