అమరావతి: ఎన్నికల వ్యూహకర్త చేతిలో పావుగా మారిపోయామా అని వైసీపీ నేతలు తీవ్ర ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకోకుండా… పీకే టీం ఏం చెబితే అదే వేదంగా భావిస్తున్నారని వాపోతున్నారు. బుధవారం జరిగిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ వర్క్‌షాప్‌లో జగన్ మాట్లాడిన తీరుపై మంత్రులు, ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమపై నిఘా పెట్టామనడంపై ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పీకే ‘ఐప్యాక్’ టీమ్ దిగుతుందంటూ జగన్ హెచ్చరించడాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నామని, ప్రజలతో ఎలా మమేకం కావాలో తమకు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. మా రాజకీయ జీవితాలను వ్యూహకర్తల చేతిలో పెడతారని మౌనంగా ప్రశ్నిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ ఏం చెబితే అది నమ్మి టికెట్లు ఇస్తామని చెప్పడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పీకే టీం చెబితే తాము ఆచరించడం ఏమిటని నిలదీస్తున్నారు.
ఇంతకాలం ప్రజా ప్రతినిధులుగా ఉన్నామని. ప్రత్యర్థులపై రాజకీయంగా ఎదురుదాడి ఎలా చేయాలో పీకే టీం చెబితే తాము చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ‘గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. అందువల్ల మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనడంలేదు. అసలే పాల్గొనని వారు కొందరైతే, తూతూ మంత్రంగా వెళ్తున్న వారు మరికొందరుండారు. నిన్న జరిగిన వర్క్‌షాప్‌లో 27 మంది సరిగా పనిచేయడం లేదని వారి పేర్లు చదివి జగన్ వినిపించారు. జగన్ వెల్లడించిన జాబితాలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేరు కూడా ఉండడం గమనార్హం. ఆర్థిక మంత్రి బుగ్గన అప్పులు ఇతర అవసరాల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. అలాంటప్పుడు ఆయన గడప గడపకూ వెళ్లేదెలాకు ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు.