లోకేష్ కంటే పవన్ బెటర్ ..!

అమరావతి: ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్ పాతుకుపోయారు. ఆయనను ఢీ కొట్టే శక్తి టీడీపీకి ఇప్పట్లో లేనట్లుగా కనిపిస్తోంది. వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీన్ని ఎవరు కాదనలేదు. కానీ ఆ వ్యతిరేకతను ఓటుబ్యాంక్‌గా మార్చుకునే సామర్ధం ఇప్పటి నేతలకు లేనట్లుగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు మెజార్టీ తగ్గచ్చు. తిరిగి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమనే విశ్లేషణలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని అప్పులతోనే నడుపుతున్నప్పటికీ సంక్షేమ పథకాలను ఆపడం లేదు. వైసీపీ లెక్కల ప్రకారం.. సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలు ఓట్లు గుమ్మరిస్తారనే ధీమాతో ఉన్నారు. అందుకే ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు ఇవ్వకున్నా.. సంక్షేమ పథాకాలను ఆపడం లేదు. ఇది జగన్ వ్యూహంలో భాగమే. అయితే ఇప్పుడు చర్చంతా జగన్‌కు ప్రత్యామ్నాయం ఎవరు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీలో ఇప్పటివరకు చంద్రబాబుదే ఏకాఛత్రాధిపత్యం. ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో నేత లేరు. చంద్రబాబుకు లోకేష్ ప్రత్యామ్నాయం కాగలరా అనేది అసలు సమస్య. చంద్రబాబు వారసుడు లోకేష్‌కు అంత శక్తి సామర్థ్యాలు లేకపోవడంతో ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయ వ్యక్తి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే లోకేష్‌లో ఆ స్థాయి లేనట్టుగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే జగన్‌కు ప్రత్యామ్నాయంగా జనసేనాని పవన్ కల్యాణ్ ముందుకొచ్చారని చెబుతున్నారు. ఆయన‌ ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నారు. జగన్‌కు ధీటుగా ఎదుగుతున్నారు. పవన్‌కు ప్రజల్లో రోజురోజుకు వస్తున్న ఆదరణ కూడా పెరుగుతోంది. అందుకే లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ బెటరని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జగన్‌ను చంద్రబాబు కంటే కూడా ధీటుగా పవన్ ఎదుర్కొంటున్నారు. సభలు, సమావేశాల్లో వైసీపీ నేతలపై విరుచుకుపడుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.

జనసేనకు టీడీపీ ఉన్న ఓటు బ్యాంక్ లేకపోవచ్చు. టీడీపీకి ఉన్న బలం కూడా ఆయనకు లేకపోవచ్చు. ఏదో ఒక కార్యక్రమంతో నిత్యం ప్రభుత్వాన్ని ధీటుగా పవన్ ఎదుర్కొంటున్నారు. ఏపీలో రైతుల సమస్యలు, రోడ్ల పరిస్థితిపై పవన్ ప్రచారానికి మీడియాలో అధిక ప్రాధాన్యత దక్కుతోంది. ప్రజల్లో సానుభూతి, పాపులారిటీ పొందాలని పవన్‌ను కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత జరిగిన గ్రామ పంచాయతి ఎన్నికల్లో ఓటు బ్యాంక్ పెంచుకుంది. పవన్‌‌కు తన అభిమానులతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఆయన వెంట ఉన్నారు. జనసేన బలం అభిమానుల ఆధరణ తోడైతే ఏపీలో పవన్ బలపడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.