కేసీఆర్ వ్యూహంతో పవన్..!

అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కూడా వైసీపీ విముక్త ఆంద్రప్రదేశ్ అని నినదిస్తున్నారు. పవన్ టార్గెట్‌ను ఫిక్స్ చేసుకుని కూర్చున్నారు. ఏపీ నుంచి వైసీపీని తరిమికొట్టాలి ఇది ఆయన ముందున్న ఏకైక లక్ష్యం. ఆయన తన లక్ష్యానికి తగ్గట్టుగా ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు. వైసీపీ నుంచి ఏపీ ప్రజలను విముక్తి చేయడానికి ఎంతకైనా తెగించడానికి జనసేనాని సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ వ్యూహాన్ని పవన్ తెరపైకి తెచ్చారు. వైసీపీ విముక్త ఏపీ అని అన్నారంటే ఖచ్చితంగా అది టీడీపీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన, టీడీపీ , బీజేపీ విడివిడిగా పోటీచేస్తే వైసీపీని ఓడించడం సాధ్యం కాదు. అందుకే కలిసి పోటీచేస్తే వైసీపీ నుంచి ఏపీకి విముక్తి కలుగుతుందని భావిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఏకమయి వైసీపీని ఓడించాలని అనుకోవడం బాగానే ఉంది. మరీ కేసీఆర్ వ్యూహం ఏమిటనే అనుమానం అందరి మదిలో మెదులుతోంది.

కేసీఆర్ కూడా ఆంధ్ర పాలకుల నుంచి తెలంగాణను విముక్తి చేయాలని అనుకున్నారు. తెలంగాణ సాధన కోసం గొంగళి పురుగునైనా ముద్దాడుతానంటూ ఒకానొక సమయంలో ప్రకటించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కేసీఆర్ ఫార్మలాను పవన్ అమలు చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి జనసేనకు అధికారం మిస్ అయితే ఇక జీవితకాలం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి గెలిచిన వైసీపీని ఆపడం ఈ రెండు పార్టీలకు కష్టంగా మారింది. అందుకే వైసీపీ విముక్త ఏపీ కోసం ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవడం ఖాయమని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటుబ్యాంక్ చీలకుండా ఉండేదుకు చంద్రబాబు, పవన్ సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చారు. జగన్‌ను ఓడించేందుకు తామంటే తాము త్యాగాలు చేస్తామని టీడీపీ జనసేన పోటీ పడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని దించేందుకు ప్రజా ఉద్యమం రావాలని అందరూ ముందుకు కదలాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

అవసరమైతే తాము త్యాగాలు చేయడానికి సిద్ధమని ఓ అడుగు ముందుకేశారు. పవన్ చొరవతో బీజేపీ కూడా ఈ కూటమిలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మూడు పార్టీలు కలిస్తే ‘వైసీపీ విముక్త ఏపీని’ చూడొచ్చు. కానీ సీట్ల లెక్కల్లో తేడా వస్తే మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా విడిపోవడం ఖాయం. ఈ మూడు పార్టీలు ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేస్తే అంతిమంగా వైసీపీ లాభపడడం ఖాయం. జనసేన టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదని ఇప్పటికే వైసీపీ నేతలు చేయాల్సిందల్లా చేస్తున్నారు. పవన్ మాత్రం ఇప్పుడవన్నీ పక్కనపెట్టి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఆ తర్వాత బలాన్ని బట్టి ముందుకెళ్లాలని చూస్తున్నారు. జనసేన టీడీపీ కలయికను బట్టే ఏపీ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. టీడీపీ జనసేన ఐక్యం కాకూడదని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలను టీడీపీ జనసేన నేతలు నిలువరించి ఉమ్మడిగా జగన్‌ను ఎదుర్కొంటారో లేదో వేచిచూడాలి.

Leave a Reply

Your email address will not be published.