తెలుగు రాష్ట్రాల్లో సురవరం ప్రతాపరెడ్డి తెలియని వారుండరు. ప్రతాపరెడ్డి 1896 మే 28న మహబూబ్‌నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో జన్మించారు. ప్రతాపరెడ్డి తండ్రి చిన్నతనం లోనే మరణించారు. అతను చిన్నాన్న రామకృష్ణారెడ్డి వద్ద పెరిగి ఎబియం మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్, మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఎ. చదివాడు. ప్రతాపరెడ్డి తన చదువు పూర్తికాగానే హైదరాబాద్ కొత్వాల్‌గా ఉన్న రాజబహదుర్ వేంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలోని రెడ్డి హాస్టల్‌కు అతను కోరికపై వచ్చాడు. ఇక్కడ అతను పనిచేసిన దశాబ్ది కాలంలో రెడ్డి హాస్టల్ నిర్వహణను ఒక విద్యాలయంగా తీర్చిదిద్దాడు. మద్రాస్ కళాశాలలో చదువుతున్నప్పుడే నాటి జాతీయ ఉద్యమ ప్రభావం ఆయనపై పడింది. నిజాం రాష్ట్రాంధ్ర దుస్థితి రూపురేఖలను మార్చాలన్న తపన ఆనాటి నుండే సురవరం మనస్సులో నాటుకొని పోయింది. 1926లో సురవరం నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టాడు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించారు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది.
అవమానించిన వారికి ధీటుగా సమాధానం
తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దానికి దీటుగా 350 మంది కవుల రచనలతో గోలకొండ కవుల సంచిక అనే సంకలనాన్ని 1934లో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పాడు. ఆ సంచిక ఇప్పటికీ అపురూపమైనది. తెలంగాణాలో గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖపాత్ర వహించాడు. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించాడు. 1943లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు, 1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
రాజకీయాలు
సురవరానికి రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోయినా సన్నిహితుల ప్రోద్బలంతో 1952లో జరిగిన తొలి ఎన్నికలలో వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ప్రముఖ న్యాయవాది వి.రామచంద్రారెడ్డి పై విజయం సాధించారు. అయితే ప్రారంభం నుంచి రాజకీయాలకు దూరంగా ఉండటం, గ్రూపు రాజకీయాలు చేయకపోవడంతో ప్రతాపరెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. ఈ విషయంపై సురవరం స్వయంగా అతను ఆప్తుడైన రంగాచార్యులకు లేఖ వ్రాస్తూ “ఈ రాజకీయపు చీకటి బజారులో నేను, నా వంటివారు ఏమియును పనికి రారు” అని స్పష్టంగా పేర్కొన్నాడు. న్యాయవాదిగా సురవరం జీవితం ప్రారంభించి, రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా తెలంగాణ ప్రజల హృదయాలలో ముద్రవేశారు. 1953 ఆగస్టు 25న సురవరం ప్రతాపరెడ్డి మరణించారు.