- నాలుగు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. నాటి జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు బేరీజు వేయాలి…
- చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు మానాలి…
- ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..
- కూటమి ప్రభుత్వం రాయలసీమను అన్ని విధాలా నిర్లక్ష్యం చేస్తోంది…
- గాంధీ జయంతి రోజున సచివాలయ వ్యవస్థను జగన్ ప్రభుత్వం ప్రారంబిస్తే.. కూటమి ప్రభుత్వం ఊరికొక మద్యం షాపును ఏర్పాటు చేస్తోంది…
- బడ్జెట్ పెట్టలేని పరిస్థితులలో కూటమి పాలన సాగుతోంది…
- కక్ష సాధింపులు పక్కనపెట్టి సూపర్ సిక్స్ పథకాల అమలుపై దృష్టిపెట్టండి…
- రాయచోటిలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి
నాలుగు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, నాటి జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు బేరీజు వేయాలని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,మాజీ ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి కోరారు.శుక్రవారం రాయచోటిలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి నూట ఇరవై రోజులు అయిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయక, రాబోయే రోజుల్లో అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పుచుండడం సిగ్గుచేటుగా ఉందన్నారు.
అధికారంలోకి వచ్చిన నాలుగు మాసాలలో జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు…
జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 1.30 లక్షల రెగ్యులర్ సచివాలయ ఉద్యోగాలు, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒకరు చొప్పున సచివాలయ, వార్డు వాలంటీర్ ఏర్పాటుతో 2 లక్షల మంది వాలంటీర్ల నియామకం, ఎన్నో రకాలుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలను స్వాతంత్య్రం వచ్చినప్పుడు నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా సంక్షేమ, అభివృద్ధి పనులను చేపట్టలేదన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు నుంచి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయకపోగా,
కొత్త ఉద్యోగాల నియామకాలు చేపట్టకపోగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను తొలగిస్తుండడం దుర్మార్గమన్నారు. వాలంటీర్లనుతొలగించారన్నారు.
గాంధీ జయంతి రోజున గ్రామ స్వరాజ్యం కోసం జగన్ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రారంభిస్తే.. కూటమి ప్రభుత్వం ఊరికొక మద్యం షాపును ప్రారంభిస్తున్నారు…
గాంధీ జయంతి రోజున జగన్ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రారంభించగా, కూటమి ప్రభుత్వం ఊరికొక మద్యం షాపును, బెల్ట్ షాపులను ప్రారంభిస్తున్నారన్నారు. ప్రజల కోసం ఎవరు పనిచేసారో ప్రజలు గుర్తించాలన్నారు. ప్రజలను కూటమి ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ప్రభుత్వం వైఫల్యాలను సరిదిద్దుకోకుండా అడిగిన వారిపై ఎదురుదాడి చేస్తోందన్నారు. దేవుడిని రాజకీయం చేస్తున్నారు.దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలు చేస్తున్నారన్నారు. సుప్రీం కోర్ట్ సైతం చంద్రబాబును మందలించినా వారిలో మార్పు రావడం లేదన్నారు.
ఫలానా అభివృద్ధి పనులు చేశామని చెప్పుకునే ధైర్యం లేదు…
ఫలానా అభివృద్ధి పనులు చేశామని చెప్పుకునే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. నాలుగు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంత మేలు చేసిందో.. అప్పటి జగన్ ప్రభుత్వం నాలుగు మాసాలలో ఎంత అభివృద్ధి, సంక్షేమం అందించిందో ప్రజలు బేరీజు వేయాలన్నారు. ఎదురుదాడి చేయడం, సమస్యను పక్కదారి పట్టించడం దుర్మార్గమన్నారు.
సనాతన ధర్మంను పవన్ కల్యాణే కనిపెట్టినట్లు మాట్లాడుచున్నాడు…
సనాతన ధర్మంను జనసేన అధినేత పవన్ కల్యాణే కనిపెట్టినట్లు, తను చెప్పినట్లుగా ఆచరించాలని ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమన్నారు. వేల ఏళ్ల క్రితమే సనాతన ధర్మం మొదలయి, ఎంతోమంది ఆచరిస్తూ, గొప్పగా కొనసాగుతోందన్నారు. తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగకున్నా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు దుష్ప్రచారం చేసి కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసారన్నారు. స్వార్ధ రాజకీయాల కోసం సనాతన ధర్మంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇక్కడ ఎవ్వరూ సనాతన ధర్మం ను అగౌరవ పరచలేదన్నారు. ప్రజాలందరిలో కులాలు, మతాలు, వర్గ వైషమ్యాలను పెంచుతున్నారన్నారు. ప్రజలకు చేయవలసిన అభివృద్ధి అంశాలపై కూటమి ప్రభుత్వ నేతలు దృష్టిపెట్టడం లేదన్నారు.
ఒక వైపు వరదలు, మరో వైపు కరవుతో అల్లాడుతున్నారు…
రాష్ట్రంలో ఒక ప్రాంతం లోనేమో వరదలు ముంచెత్తాయి. మరో ప్రాంతంలో వర్షాలు కురవక కరవు రక్కసి రాజ్యమేలు తుంటే ప్రజలకు, రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు. ఇంతవరకు రైతులకు పెట్టుబడి సాయం క్రింద రైతు భరోసా అందివ్వలేదన్నారు. రూ 20 వేలును ఒకే విడతలో రైతు భరోసా క్రింద త్వరగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేసారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ లో సాగుచేసిన పంటలు నిట్టనిలువునా ఎండిపోయాయని, రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ క్రింద ప్రతి ఎకరాకు చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, వారిని ఆదుకోవాలన్నారు. పాలు ధరలు బాగా తగ్గాయన్నారు. పాడిపైన ఆధార పడే రైతులకు గతంలో జగన్ ప్రభుత్వం అండగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు.
ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ కేంద్రాన్ని తరలిస్తే ఇక్కడి యువత పరిస్థితి ఏంటి?
కడప కొప్పర్తికి వచ్చిన సూక్ష్మ , చిన్న, మధ్యతరహా సంస్థల సాంకేతిక శిక్షణా కేంద్రం (ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ సెంటర్) ను, రాయలసీమకే తలమానికంగా అనుకుంటున్నటువంటి లా యూనివర్సిటీనీ, హైకోర్ట్ ను అమరావతికి తరలించడం దుర్మార్గమన్నారు. అన్ని ప్రాంతాలలో సమంగా అభివృద్ధి చేయాలే తప్ప ఒక ప్రాంతాన్ని అనగతొక్కి అన్నీ ఒక చోట చేర్చుచుండడం దుర్మార్గమన్నారు. దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ కేంద్రాలు 14 మంజూరైతే అందులో కడప కొప్పర్తి ఒకటన్నారు. ఇందుకు రూ 180 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయన్నారు. ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ కేంద్రాన్ని తరలిస్తే ఇక్కడి యువత పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. యువతకు మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు. డిఎస్సీపై నోటిఫికేషన్ ఇచ్చినా పూర్తి క్లారిటీ లేదన్నారు. అన్నింటిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం దృష్టంతా మద్యంపైనే… ప్రభుత్వోదుగులనూ గాలికొదిలేశారు…
కూటమి ప్రభుత్వం దృష్టంతా మద్యంపైనే వున్నట్లుగా ఉందన్నారు. ఇది సమంజసం కాదని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వోదుగులనూ గాలికొదిలేశారన్నారు. ఉద్యోగులకు పి ఆర్ సి, ఐ ఆర్ ల గురించి మాట్లాడడం లేదన్నారు. ఉద్యోగులకు మంచి చేయాలని కోరారు. ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లో ఒకటో తేదీన జీతాలను ఇచ్చారే కానీ,అక్టోబర్ నెలలో ఇంతవరకు అన్ని శాఖల వుద్యోగులకు వేతనాలు అందివ్వలేదన్నారు.ఇప్పటి వరకు బడ్జెట్ పెట్టలేని పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. రైతులు, యువత,ఉద్యోగులు, మహిళలకు చేయాల్సిన పనులు చేయకపోవడం ఏంటని ప్రశించారు.బడ్జెట్ లో ఎంతెంత నిధులు కేటాయిస్తే వీరి పరిస్థితి బయట పడుతుందన్న ఉద్దేశ్యంతో బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదన్నారు.అమ్మఒడి పథకం ,తదితర పథకాలును ఇవ్వకపోవడం వల్లనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 24 శాతం తగ్గిందన్నారు.పోలవరం ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తే బాధ కలుగుతుందన్నారు.డయాప్రమ్ వాల్ ఎందుకు దెబ్బ తినిందన్న నిపుణుల కమిటీ నివేదికను చూస్తే చంద్రబాబు నిర్లక్ష్యం కన్పిస్తోందన్నారు. స్పిల్ వే పూర్తి చేసిన తరువాతనే మెయిన్ ప్రాజెక్ట్ లు కట్టాలన్నారు. అలాకాకుండా డయాప్రమ్ వాల్ ను హడావుడిగా చంద్రబాబు కట్టడం వల్లే దానిని సరిగా పూర్తి చేయకపోవడం వల్ల 2018 లో వచ్చిన వరదవల్ల అది సీఫెజ్ అయి కొట్టుకు పోయిందన్నారు. నిపుణుల కమిటీయే ఈ విషయాలను బయటపెట్టిందని, ఈ విషయాలను చంద్రబాబు మాట్లాడరన్నారు.ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి సున్నితమైన అంశాలును తీసుకు వస్తున్నారన్నారు.
ఉచిత ఇసుక ఎక్కడ?
ఉచితంగా ఇసుక దొరక్క పోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులనుఎదుర్కొంటున్నారన్నారు.ఉచితంగా ఇసుకను అందచేస్తామని కూటమి ప్రభుత్వ నేతలు ఆర్భాటంగా చెప్పుచున్నారే కానీ ఎక్కడా ఉచితంగాఅందించలేదన్నారు.
యువతులు,చిన్నారుల అత్యాచారాలకు అంతే లేకుండాపోతోంది…
కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి రాష్ట్రంలోయువతులు,చిన్నారుల అత్యాచారాలకు అంతేలేకుండాపోతోందని శ్రీకాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఐదవ తరగతి చదువుచున్న చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశారని,చిత్తూరు జిల్లా
పుంగనూరులో నాలుగు రోజుల క్రితం ఐదేళ్ల ముస్లిం చిన్నారిని అపహరించి కిరాతకంగా చంపడం జరిగిందన్నారు. ఇన్ని ఘటనలు జరుగుచున్నా ఒక్క ఘటనలో కూడా నేరస్తులను గుర్తించకపోవడం దారుణమన్నారు.లాఅండ్ ఆర్డర్ పై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన సూచించారు.వైఎస్ఆర్ సిపి శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు.కూటమి ప్రభుత్వ అరాచకాలు ఎక్కువ కాలం కొనసాగవన్నారు.ఆర్థిక పరిస్థితులు చూస్తుంటే భయమేస్తుందని చంద్రబాబు ఎలా చెపుతారని ప్రశ్నించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలకు బడ్జెట్ పెట్టి నిధులు కేటాయించాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి, వైఎస్ఆర్ సిపి మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొలిమి హారూన్ బాష తదితరులు పాల్గొన్నారు