జగన్ కోసం మళ్లీ రంగంలోకి పీకే… వైసీపీలో నూతనోత్సాహం!
ఆర్.బి.ఎం అమరావతి: ఏపీలోకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ రంగంలోకి దిగనున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా సీఎం జగన్, మంత్రులతో చెప్పారంట. ఏపీ కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో జగన్ అర్ధగంటకుపైగా ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ ప్రత్యేక భేటీలో పీకే టీం అంశాన్ని జగన్ ప్రస్తావించారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది నుంచి పీకే టీం ఏపీలో అడుగుపెడుతుందని ఆయన మంత్రులకు చెప్పినట్లు సమాచారం. అంతేకాదు పీకే టీం మళ్లీ రంగంలోకి దిగుతోందని మంత్రులను ఆయన అలర్ట్ చేశారంట. ఎన్నికల వ్యూహకర్తగా ఇక పనిచేయనని పీకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గతంలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న సమయంలేనే జగన్, పీకే మధ్య ఒప్పందం కుదరిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందువల్లే తిరిగి వైసీపీ వ్యూహకర్తగా పనిచేసేందుకు మళ్లీ రంగంలోకి ప్రశాంత్ కిషోర్ వస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పీకే రీఎంట్రీ చేస్తున్నారనే సమాచారంతో వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.