బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దసరా నవరాత్రులు, అమ్మవారి జన్మనక్షత్రమైన మూలనక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.