కేసీఆర్ పార్టీలో చేరుతారా.. ఏపీ నేతల తీరంతే..?

సీఎం కేసీఆర్‌ విజయదశమినాడు జాతీయ పార్టీ పెట్టబోతున్నారు. టీఆర్‌ఎస్‌ను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాంక్షతో ఏర్పాటు చేశారు. ఇప్పుడు టీఆర్‌‌ఎస్ జాతీయపార్టీగా మారబోతోంది. జాతీయపార్టీని ఏర్పాటు చేసిన తర్వాత పార్టీని విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందువల్ల ముందుగా ఆంధ్రప్రదేశ్‌పై కేసీఆర్ పోకస్ పెట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల నేతలను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ మూడు జిల్లాల్లో కూడా టీడీపీ నేతలకు కేసీఆర్‌ గాలం వేస్తున్నారని చెబుతున్నారు. గతంలో కేసీఆర్‌తో కలిసి పనిచేసిన పలువురు నేతలను ఆయన ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో కొప్పుల, వెలమ సామాజికవర్గం నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలతో కేసీఆర్‌ మంతనాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడం వేరు. ఏపీలో విస్తరించడం వేరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడిచింది ఆంధ్రపాలకుల ద్వేషం మీదే. ఉద్యమసమయంలో ఆంధ్ర పాలకుల్నిదూషించకుండా కేసీఆర్ నిద్రపోలేదు. విభజన జరిగినా ఇప్పటికీ తెలంగాణతో ఏపీకి అనేక సమస్యలు పరిష్కారం కాలేదు. నీటి వివాదాలు, కరెంట్ బకాయిల ఇంకా పరిష్కారం కాలేదు. ఇవన్నీ రాజకీయపార్టీ నేతలకు అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను ఈ నేతలు పట్టించుకోరు. ఏపీలో అడుగుపెడతామని కేసీఆర్ కొంతకాలం చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రకటనను నిజం చేస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు చేసినప్పటి నుండే ఏపీలో ప్రభుత్వ పరిపాలనపై టీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ ఏపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగానే అంటున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ప్రజలు కులం అంటే పడి చస్తారని టీఆర్ఎస్ నేతలు తరచూ చెబుతుంటారు. ఈ ప్రకారం కేసీఆర్ కులం అయిన వెలమ, కొప్పుల వెలమ వంటి కులాల్ని ఓటు బ్యాంక్ చేసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కులాన్ని ఆధారం చేసుకుని ఏపీలో విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ జాతీయ పార్టీ ఏపీలోని రాజకీయ నేతలు ఎంత స్వార్థ పరులో మరోసారి బయటపెట్టనుందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.