కృష్ణ అంత్యక్రియలు.. మహేష్‌పై విమర్శలు

హైదరాబాద్: వేలాది అభిమానులు వేల తారకల కన్నీటి నయనాలతో సూపర్ స్టార్ కృష్ణకు కన్నీటి వీడ్కోలు పలికారు. సూపర్‌స్టార్‌ కృష్ణగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఘట్టమనేని శివరామకృష్ణ శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. బుధవారం కృష్ణ అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాల మధ్య జరిగాయి. ఎక్కడెక్కడో ఉన్న అభిమానులంతా పోటెత్తడంతో పద్మాలయా స్టూడియోస్‌ పరిసరాలు, సమీప రహదారులు జనసంద్రమయ్యాయి. అభిమానుల గుండెలు భారమై.. ఆ బాధంతా కన్నీరుగా ఉబికి వస్తుండగా తమ ప్రియతమ నటుడికి కడసారి వీడ్కోలు పలికారు. బాధాతప్తమైన హృదయాలతో భారంగా అడుగులు వేస్తూ తమ అభిమానాన్ని నినాదాల రూపంలో వ్యక్తీకరిస్తూ అంతిమయాత్రలో అభిమానులు ఆప్తులు పాల్గొన్నారు.

అయితే కృష్ణకు అంత్యక్రియలు జరిగిన విధానంపై టాలీవుడ్ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. కుమారుడు మహేష్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణకు పద్మాలయా స్టూడియో అంటే ఎంత ఇష్టం. అందుకే ఆయన పార్థివదేహాన్ని అక్కడే ఉంచారు. అక్కడి నుంచే ఆయనను సాగనంపారు. కృష్ణ స్వంత స్టూడియో పద్మాలయాను ప్రయివేటు అపార్ట్ మెంట్ల నిర్మాణానికి ఇచ్చేసినా, దానికి సమీపంలో ఇంకా అయిదు ఎకరాల వరకు స్థలం వుందని అంటున్నారు. అలాగే పద్మాలయా స్టూడియోకి ప్రత్యామ్నాయంగా మహేశ్వరం ప్రాంతంలో కొన్ని ఎకరాల స్థలాన్ని కృష్ణ కొని వుంచినట్లు చెబుతున్నారు. దానికి సమీపంలోనే మహేష్ కు 30 ఎకరాల వరకు స్థలం వుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఎక్కడ పడితే అక్కడ స్థలాలు వుండగా, ఒక్క ఎకరా కేటాయించి అక్కడ అంత్య క్రియలు జ‌రిపించి, స్మారక మందిరం కట్టించి వుంటే బాగుండేదని టాలీవుడ్‌తో పాటు అభిమానులు కోరుకుంటున్నారు. విజ‌యనిర్మల కనుక బతికి వుంటే ఇలా జ‌రగనిచ్చేది కాదని కూడా కామెంట్ చేస్తున్నారు. మహాప్రస్థానంలో కృష్ణ అంత్య క్రియలు జ‌రపాలన్న నిర్ణయాన్ని ఆదిశేషగిరిరావు, దివంగత రమేష్ బాబు భార్య, మరి కొందరు వ్యతిరేకించారని చెబుతున్నారు. మొత్తం మీద కృష్ణ అంత్యక్రియలు మహా ప్రస్థానంలో జ‌రపడం పట్ల టాలీవుడ్ లో చాలా మంది పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నమాట వాస్తవం.

Leave a Reply

Your email address will not be published.