మా ఇష్టం వచ్చినోళ్లకే దళిత బంధు ఇస్తాం.. అడగటానికి నీవెవరు.. వైరల్ అవుతున్న ఇంద్రకరణ్‌ రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్:  దళితుల అభ్యన్నతి కోసం ‘దళిత బంధు’ను ప్రభుత్వం తెచ్చింది. ఈ పథకం అమలులో ఇంకా ఎన్నో ఆరోపణలు, వివాదాలు చోటుచేసుకుంటాయి. అర్హులకు దళితబంధు ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడిన మాటలు దళితబంధు పథకం అమలులో వస్తున్న విమర్శలకు అద్దపడుతున్నాయి. నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి)లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం రాత్రి దసరా సందర్భంగా బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన పలువురు దళిత మహిళలు దళితబంధుపై మంత్రిని నిలదీశారు. అప్పుడు ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘మా ఇష్టం వచ్చినోళ్లకే దళితబంధు ఇస్తాం. నువ్వెందుకు మాట్లాడుతున్నవ్‌’ అని దళిత మహిళపై ఇంద్రకరణ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను బయటకు తీసుకెళ్లండని పోలీసులను ఆదేశించారు. బీజేపీ నేతలతో తిరిగేవాళ్లు, ఈ పార్టీ నేతలనే దళితబంధు అడగాలని చెప్పారు. రాష్ట్రమంతటా విడతల వారీగా దళిత బంధు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే అర్హులందరికీ దళిత బంధు ఇస్తామని చెప్పారు. అంతవరకు ఓపికగా ఉండాలని మహిళలకు సూచించారు. అయితే ఇంద్రకరణ్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.