హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనంపై గందరగోళం..
ఆర్.బి.ఎం హైదరాబాద్: హైదరాబాద్‌లో వినాయకచవితిని అంత్యంతవైభవంగా నిర్వహిస్తారు. అంతే వైభవంగా నిమజ్జానాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ భారీగా ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే ఈ సారి మాత్రం నిమజ్జనంపై గందరగోళం ఏర్పడింది. ప్రతి ఏడాది గణేష్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. ట్యాంక్‌బండ్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే గణేష్ నిమజ్జనంపై సోమవారం సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి తెగేసి చెబుతోంది. హైకోర్టు తీర్పును అమలు చేస్తారా చేయారా అనేది తెలంగాణ ప్రభుత్వం ఇష్టమని, ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచైనా సరే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం ఏర్పాట్లు చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు డిమాండ్ చేశారు. హుస్సేన్ సాగర్‌లో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామనటం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అభిప్రాయం మాత్రమేనని, వాళ్ళ అభిప్రాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ కొట్టిపారేశారు. గణేష్ చతుర్థికి దేశంలోనే హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానమందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.