రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య వైరానికి కారణం అదేనా..!

రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య వైరానికి కారణం అదేనా..!

ఆర్.బి.ఎం డెస్క్, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పటితో చల్లారేటట్లు కనిపించడం లేదు. గతంలో ఈ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. అయితే ఇటీవల మల్లారెడ్డి ఆస్తులపై రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలను మంత్రి మల్లారెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. రేవంత్‌రెడ్డిపై మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాల్లారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా స్పందించారు. మల్లారెడ్డిపై పోలీసులకు ఓ దశలో ఫిర్యాదు కూడా చేశారు.

రేవంత్‌రెడ్డి, మల్లారెడ్డి మధ్య వైరానికి కారణం!
మల్కాజిగిరి నియోజకవర్గంలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దీక్ష చేపట్టారు. ఈ దీక్ష రేవంత్ వర్సెస్ మంత్రి మల్లారెడ్డి అన్నట్లుగా మారింది. రేవంత్ దీక్ష నేపథ్యంలో మల్లారెడ్డి, కాంగ్రెస్‌కు పోటీగా ఫ్లెక్సీలు కట్టించారు. ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో అదే రోజు గులాబీ పార్టీ కార్యకర్తలు, రేవంత్‌రెడ్డి దీక్షకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దీంతో మల్లారెడ్డిపై రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయితో విరుచుకుపడ్డారు. ఒక స్థాయిలో మల్లారెడ్డిని జోకర్, బ్రోకర్ అంటూ మండిపడ్డారు. రేవంత్‌కు కౌంటర్‌గా మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచాయి.

రేవంత్‌రెడ్డి, మల్లారెడ్డి మధ్య విభేదాలు గత కొంతకాలంగా నడుస్తున్నాయని, వీరిద్దరినీ గమనించిన రాజకీయ నేతలు చెబుతున్నారు. ఏడేళ్లుగా ఇద్దరి మధ్య వైరం కొనసాగుతూ వస్తోందంటున్నారు. గతంలో వీరిద్దరూ టీడీపీ నేతలే. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్, టీడీపీ నుంచి మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ను ఆశించారని చెబుతున్నారు. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో మంతనాలు కూడా జరిపారని చెబుతున్నారు. అయితే మల్లారెడ్డి తన పలుకుబడితో మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ను దక్కించుకున్నారు. అయితే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీనే గెలిపించాలనే ఉద్దేశంతో ఇద్దరి మధ్య రాజీకుదిర్చే పనిని రంగారెడ్డి జిల్లా బాధ్యతలు చంద్రబాబు అప్పగించారంట. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది.

ఆ తర్వాత టీడీపీ నుంచి మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మల్లారెడ్డికి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డిని ఓడించి.. రేవంత్ ఎంపీగా గెలిచారు. దాంతో 2014లో తనకు టికెట్ రాకుండా అడ్డుకున్న మల్లారెడ్డిపై రేవంత్‌రెడ్డి రివెంజ్ తీసుకున్నాడనే చర్చ అప్పట్లో జరిగింది.

Leave a Reply

Your email address will not be published.