గవర్నర్, కేసీఆర్ మధ్య విభేదాలు ముదురుతున్నాయా? దానికి కారణం ఎవరు?

telangana cm kcr

గవర్నర్, కేసీఆర్ మధ్య విభేదాలు ముదురుతున్నాయా? దానికి కారణం ఎవరు?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ మధ్య విభేదాలు ముదురుతున్నాయని ఇటీవల రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందుకు సాక్ష్యంగా రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకలు నిలిచాయి. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా గణతంత్ర వేడుకల వేడుకలకు రాజ్‌భవన్ దూరంగా ఉంది. ఈ ఏడాది రాజ్‌భవన్ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. అయితే స్వయంగా గవర్నర్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కేసీఆర్ డుమ్మా కొట్టారు. కేసీఆర్ గైర్హాజరవడంతో ఇన్నాళ్లు జరుగుతున్న ప్రచారానికి బలం వచ్చింది. రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమం చేపట్టినా కేసీఆర్, రాజ్‌భవన్ వెళ్లి సంప్రదింపులు జరిపేవారు. అయితే ఆయన కొన్నాళ్లుగా రాజ్‌భవన్‌కు దూరంగా ఉంటున్నారు. ఇందుకు రాజకీయవర్గాల్లో కారణాలు కొన్ని వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రగతిని కాకుండా ప్రధాని మోదీపై గవర్నర్ ప్రశంసలు గుప్పిస్తున్నారనే వాదన ఒకటి వినిపిస్తోంది. ప్రధానిని గవర్నర్ పొగడడం వల్ల కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారనే చర్చ జరుగుతోంది.

గణతంత్ర దినోత్సవం నాడు గవర్నర్‌ చదివిన స్పీచ్‌ కాపీని క్యాబినెట్‌ ఆమోదించలేదని, గవర్నరే స్వయంగా తయారు చేసుకుని చదివారనే ప్రచారం జరుగుతోంది. రాజ్‌భవన్‌లో బుధవారం నిర్వహించిన గణతంత్ర వేడుకలకు కేసీఆర్‌ హాజరవలేదు. ఆయన తరఫున కనీసం మంత్రులు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. ప్రొటోకాల్‌ ప్రకారం స్వాతంత్య్ర దినోత్సవం రోజు రాజధానిలో సీఎం, జిల్లాల్లో మంత్రులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే గణతంత్ర దినోత్సవం రోజు గవర్నర్‌, జిల్లాల్లో కలెక్టర్లు జాతీయ పతాకాలను ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. గవర్నర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేసినా.. సీఎం, మంత్రులు హాజరు కావడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈసారి కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం కొసమెరుపు.

ప్రధాని మోదీ ఇటీవల కొవిడ్‌పై అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కూడా కేసీఆర్‌ హజరుకాలేదు. ఇప్పుడు గణతంత్ర దినోత్సవానికీ కూడా గైర్హాజరయ్యారు. కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే బీజేపీ నేతలతో, ఆ పార్టీ నియమించిన గవర్నర్‌తో దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి కేంద్రం సహాయం అందిస్తోందని బీజేపీ నేతలు.. లేదులేదు రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం పాత్ర లేదని మంత్రులు కొట్టిపారేస్తున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య వాదోపవాదాలు జరుగున్న తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 8 మెడికల్‌ కాలేజీలు ఇచ్చిందని గవర్నర్‌ గుర్తు చేశారు. అంతేకాదు వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం సహకరిస్తుందని పేర్కొన్నారు. తన ఒత్తిడి కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో చేరిందని గవర్నర్ తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై రాజ్‌భవన్‌లో రెండు ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేశారు.ఫిర్యాదుల బాక్సులు పెట్టడం.. ప్రభుత్వానికి నచ్చలేదని చెబుతున్నారు. ఇలా అనేక కారణాలు సీఎంవో, రాజ్‌భవన్‌ మధ్య అగాథం పెంచుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.