తెలంగాణ ద్రోహి కేసీఆర్‌: బండి సంజయ్‌

తెలంగాణ ద్రోహి  కేసీఆర్‌: బండి సంజయ్‌

  • 7వ రోజు పూర్తయిన ప్రజా సంగ్రామ యాత్ర

ఆర్.బి.ఎం వికారాబాద్‌: కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా 575 టీఎంసీలు ఉంటే సీఎం కేసీఆర్‌ 299 టీఎంసీలకు అంగీకరించి తెలంగాణ ప్రజల నోట్లో మట్ట్టి కొట్టి ద్రోహం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ నీటి వాటా తగ్గించి వాడుకోవడానికి నాడు చంద్రబాబు, ఆ తరువాత జగన్‌తో సీఎం కేసీఆర్‌ కుమ్మక్కవడమే కారణమని ఆయన ఆరోపించారు. నదీ జలాల వాటాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రశ్నించాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌, కేఆర్‌ఎంబీ సమావేశాలకు వెళ్లకుండా మొహం చాటేసి తెలంగాణకు ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ నీటి వాటా హక్కున్న జలాలపై పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే అభ్యంతరం వ్యక్తం చేయకుండా కమీషన్లకు కక్కుర్తి పడ్డ సీఎం కేసీఆర్‌ అని, కేఆర్‌ఎంబీ సమావేశానికి వెళితే తన తప్పులు బయటకు తీసి ప్రశ్నిస్తారని భయంతోనే తెలంగాణ అధికారులను సమావేశానికి హాజరు కానీయడం లేదని ఆరోపించారు. మీరు సమావేశాన్ని బహిష్కరిస్తే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని బహిష్కరిస్తారని ఆయన సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య చేశారు. రాయలసీమను రత్నాల సీమ చేస్తానని చెప్పింది కేసీఆరే అన్నది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన నదీ జలాలను పక్క రాష్ట్రం తన్నుకుపోతుంటే ప్రశ్నించాల్సిన కేఎంఆర్‌బీ సమావేశాన్ని బహిష్కరించిన కేసీఆర్‌ తెలంగాణ ద్రోహి అని, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు నిన్ను బైకాట్‌ చేస్తారని ఆయన కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. జిల్లాకు రావాల్సిన ప్రాణహిత చేవెళ్లను దారి మళ్లించారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు రీడిజైన్‌తో ఈ ప్రాంతానికి నీళ్లు రాకుండా చేశారని బండి సంజయ్‌ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published.