రేవంత్ ప్లాన్ సక్సెస్.. ఇరకాటంలో కేటీఆర్

రేవంత్ ప్లాన్ సక్సెస్.. ఇరకాటంలో కేటీఆర్

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారు. రేవంత్‌పై ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ ఖాతాలో ఎద్దేవాచేస్తుంటారు. అదే ట్విట్టర్‌ను ఉపయోగించుకుని కేటీఆర్‌ను రేవంత్ ట్రాప్‌లోకి దింపారు. రాష్ట్రంలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో కేటీఆర్‌కు సంబంధం ఉందని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రజాప్రతినిధులుగా ముందుగా మనమే పరీక్షలు చేయించుకుందామంటూ మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి.. రేవంత్‌రెడ్డి ‘వైట్‌ చాలెంజ్‌’పేరిట సవాల్‌ విసిరారు. తాను, విశ్వేశ్వర్‌రెడ్డి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు వెళ్తున్నామని, కేటీఆర్‌ కూడా వస్తే డ్రగ్స్‌ పరీక్షలకు నమూనాలు ఇస్తామంటూ సోమవారం ఉదయం రేవంత్‌ ట్వీట్‌ చేశారు.

రేవంత్ సవాల్‌కు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాను ఏ పరీక్షలకైనా సిధ్దమని ప్రకటించారు. చర్లపల్లి జైలుకు వెళ్లివచ్చిన వారి సవాలును స్వీకరించే స్థాయి నాది కాదని, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కూడా సిద్ధంగా ఉంటే ఢిల్లీకి వెళ్లి ఎయిమ్స్‌లో పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ముందు అనుకున్నట్టే రేవంత్, విశ్వేశ్వరరెడ్డి గన్‌పార్క్ వచ్చారు. ఇంతలోనే రేవంత్‌పై సిటీ సివిల్‌ కోర్టులో కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. రేవంత్‌రెడ్డి కొంతకాలంగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, డ్రగ్స్‌ కేసులో ఈడీ నిర్వహిస్తున్న విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో, ఆయా కేసులతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా పదే పదే తన పేరును ప్రస్తావిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టులు, కేసులతో తమను బెదిరించాలని కేటీఆర్ చూస్తున్నారని ఆయన బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ నేతల అల్టిమేటంలో టీఆర్‌ఎస్ నేతలు గందరగోళంలో పడ్డారు. మొత్తానికి డ్రగ్స్ కేసు వ్యవహారంలో కేటీఆర్ లాగి రేవంత్ సక్సెస్ అయ్యారనే చర్చ నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.