హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పెద్ద జోకేశారు. వర్షం గురించి ఎవరూ ఆలోచించ వద్దని, తాను ఆగోపో అంటే వర్షం ఆగిపోతుందని పెద్ద జోక్ పేల్చారు. శాంతి సభ ఆదివారం సాయంత్రం జింఖానా గ్రౌండ్‌లో జరగబోతోందని పాల్ తెలిపారు. వర్షం గురించి భయపడకుండా ప్రజలు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. దేశానికి, దేవుడికి, సత్యానికి, శాంతికి వర్షం అడ్డు రాలేదన్నారు. 75 ఏళ్ల కిందట శాంతితోనే దేశానికి స్వాతంత్ర్యం సాధ్యమైందని గుర్తుచేశారు. శాంతి వైపు ఉంటారా..? యుద్ధం వైపు ఉంటారా అని ప్రజలను ప్రశ్నించారు. తాను చేస్తున్న పోరాటానికి అమెరికానే తల వంచిందన్నారు. అమెరికాలో తాను 300 సభలు పెట్టానని తెలిపారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగలేదన్నారు. అయితే స్వదేశంలో శాంతి సభలు పెడతామంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గద్దర్, కోదండరాం తనకు మద్దతు ఇస్తున్నారని ఆయన తెలిపారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా జరిగే ప్రపంచ శాంతి మహాసభలను విజయవంతం చేయాలని పాల్ కోరారు.