ముంచుకొస్తున్న మునుగోడు.. పడిపోతున్న కోమటిరెడ్డి గ్రాఫ్…!

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికకు సమయం ముంచుకోస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతోనే మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు అన్ని పార్టీలు మునుగోడు నియోజకవర్గంపై దృష్టిపెట్టాయి. టీఆర్‌ఎస్‌ ఇక్కడ గెలిచి పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత లేదని చాటాలనుకుంటోంది. సిట్టింగ్‌ స్థానం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. మునుగోడులో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపేనని సంకేతాలివ్వాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మూడేళ్లు అయింది. కానీ నియోజకవర్గంలో చెప్పుకోదగిన అభివృద్ధి పనులు ఏమీ జరుగలేదు. దీన్నే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజగోపాల్‌రెడ్డి భావించారు. కానీ ఆయన అనుకున్న దానికంటే భిన్నంగా నియోజకవర్గంలో పరిస్థితులున్నాయని అంటున్నారు. ప్రభుత్వంతో పొట్లాడి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు రాబట్టాలని అలా కాకుండా రాజీనామా చేయడం ఏమిటని మునుగోడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

దీంతో మునుగోడు ప్రజల్లో రాజగోపాల్‌రెడ్డిని ఎందుకు గెలిపించామన్న భావన ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. గతంలో హుజూరాబాద్ ఎంతటి చర్చనీయాంశమైందో ఇప్పుడు మునుగోడు అంతటి చర్చనీయాంశమైంది. కాకపొతే అప్పట్లో ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ బయటకు గెంటితే ఆయన బీజేపీలో చేరి గెలిచాడు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఎవరూ గెంటకుండానే తన సొంత నిర్ణయంతో బీజేపీలో చేరారు. అయితే ప్రతిష్టకు పోయిన రాజగోపాల్‌రెడ్డి ఉప ఎన్నికలను తెర మీదకు తెచ్చారు. అయితే ఉప ఎన్నిక ఎందుకన్న ప్రశ్న నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారపార్టీలో చేరకుండా ప్రతిపక్ష కాంగ్రెస్‌ను వీడి మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీలో చేరారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటనే ప్రశ్న క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.

ఈ ప్రచారాన్ని నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలు విస్వసిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతోనే తాను పదవికి రాజీనామా చేశానని రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నారు. ఆయన ప్రకటించినట్లుగానే రాజీనామా తర్వాత నియోజకవర్గానికి నిధులు వస్తున్నాయి. అభివృద్ధి పనులు మొదలవుతున్నాయి. రాజగోపాల్‌ రాజీనామా ఫలాలు నియోజకవర్గ ప్రజలకు అందుతున్నాయి. అయితే రాజగోపాల్‌రెడ్డిపై మాత్రం సానుభూతి చూపుతున్నట్లు కనిపించడం లేదని అంటున్నారు. ఆయనపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారు. కాంగ్రెస్‌ తరఫున గెలిచి ఎలాంటి కారణం లేకుండా బీజేపీలో చేరి ఉప ఎన్నికలకు కారణమయ్యారని స్థానికుల్లో కొందరు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన గ్రాఫ్‌ బాగా తగ్గుముఖం పట్టిందని అంటున్నారు. రాజగోపాల్‌ రెడ్డి గెలవడానికి తీవ్రంగానే కష్టపడాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.