అమరావతి: ఏపీ రాజకీయాలు మునుపెన్నడు లేనివిధంగా దిగజారిపోతున్నాయి. వ్యక్తిగత దూషణలతో మొదలు పెట్టిన నేతలిప్పుడు కుటుంబసభ్యులను బజారుకీడ్చుతున్నారు. వైసీపీ, టీడీపీ నేతలు ఎవరికివారు మాకు మరొకరు సాటి రాలేరన్నట్లుగా బూతు పురాణాలు అందుకుంటున్నారు. రెండు పార్టీల నేతలు హద్దులు దాటుతున్నారు. రాజకీయాల మాటున వికృత పోకడలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వైరం వ్యక్తిగత వైరంగా మారిపోతోంది. సభలు సమావేశాలు చివరికి అసెంబ్లీలో కూడా కుటుంబసభ్యులను వివాదాల్లోకి లాగి ఆనందపడుతున్నారు. ఎంతలా దిగజారిపోయారంటే భార్యల ప్రాతివత్యాన్ని కించపర్చేలా మాట్లాడుతున్నారు. ఇలాంటి పోకడలు సమాజ హననానికి కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుమార్పు వివాదం ఏపీ రాజకీయాలను కుదుపేస్తోంది. ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్‌ఆర్ పేరు పెట్టడంపై ప్రజలతో పాటు సొంత పార్టీ నేతల నుంచి జగన్ వ్యతిరేకతను చెవిచూస్తున్నారు.
ఈ వ్యతిరేకతను తగ్గించేందుకు వైసీపీ నేతలు నానాపాట్లు పడుతున్నారు. రెండు రోజుల కిందట విజయవాడ బెంజ్ సర్కిల్ లో పంతొమ్మిది 1995లో డెక్కన్ క్రానికల్‌కు చంద్రబాబు ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు ‘వుయ్ డోంట్ నీడ్ ఎన్టీఆర్’ అని డెక్కన్ క్రానికల్‌లో పతాక శీర్షికన వచ్చిన పేపర్ క్లిప్పింగులను పోస్టర్లుగా అతికించారు. అది మరువక ముందే ‘మా ఆవిడ పతివ్రత’ అంటూ చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఫొటోలతో కూడిన పోస్టర్లు దర్శనమిచ్చాయి. నీచ రాజకీయాలకు దిగడం దారుణమని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ వైసీపీ పేటీఎం బ్యాచ్ పనేనంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం మూలాలు ఏపీలో కూడా ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్వయంగా జగన్ సతీమణి భారతినే కాషాయనేతలు టార్గెట్ చేశారు. భారత్ పే పేరడీగా భారతీ పే అంటూ ప్రచారం మొదలు పెట్టారు. లిక్కర్ సొమ్మును భారతి పేరుతో చెల్లించాలంటూ భారతి పే పేరుతో ఓ ఫోన్ పే క్యూఆర్ కోడ్‌ను ఆమె ఫొటోతో సహా టీడీపీ సోషల్ మీడియా క్రియేట్ చేసింది. దీన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. నారా బ్రాహ్మణి పేరుతో డబ్బు చెల్లించాలంటూ ఆమె పేరు ఫొటోతో సహా క్యూఆర్ కోడ్‌ను రూపొందించి వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతటితో వైసీపీ ఆగలేదు. భువనేశ్వరిని, లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి తదితరులను కూడా తెరపైకి తేవడం గమనార్హం. ఈ తరహా ప్రచారం ఎవరు మొదలు పెట్టినా ఎవరు కొనసాగిస్తున్నా దాన్ని ప్రజలు అంగీకరించరని హెచ్చరిస్తున్నారు. రెండు పార్టీల నేతలు తమ కార్యకర్తలను కాస్త అదుపులో పెట్టుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు. మీ చెత్త రాజకీయాలకు కుటుంబసభ్యులు ఎందుకు టార్గెట్ కావాలని ప్రశ్నిస్తున్నారు.