ఎంపీ అర్వింద్ గుండాలా, వీధిరౌడీలాగా వ్యవహరిస్తున్నారు: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ఆర్.బి.ఎం నందిపేట: దమ్ముంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తనపై పోటీ చేయాలని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ అర్వింద్ గుండాలా, వీధిరౌడీగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శనివారం నందిపేట పోలీసు స్టేషన్‌కు వచ్చి స్టేషన్‌ను కూలగొడతామని మాట్లాడారని, ఎంపీ అర్వింద్ జిల్లాలోని ఏ ఒక్క పోలీస్‌స్టేషన్‌పై చెయ్యి వేసినా చట్టం తనపని తాను చేసుకుంటుందని అన్నారు. ప్రతీ నిమిషం ప్రజలకు కాపాలకాస్తున్న రాష్ట్ర పోలీసులపై నిందలు వేయడం, ఫేక్ ఎంపీ అయిన అర్వింద్‌కు తగదన్నారు. బాండ్ పేపర్‌పై హామీ ఇచ్చి పసుపుబోర్డు తీసుకురాని ఎంపీ అర్వింద్ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై, తనపై నోరు పారేసుకోవడం తనకే మంచిదికాదని ఆయన అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే భవిష్యత్తులో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లా ప్రజలు కూడా తరిమికొడతారని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.