ఎమ్మెల్యేలకు ‘దళితబంధు’ అప్పగించొద్దు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ‘దళితబంధు’ పంపిణీ బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగిస్తే రాబందుల్లా పీక్కుతింటారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గానికి 100మందికి దళితబంధు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి, పంపిణీ బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారని తెలిపారు. ఎమ్మెల్యేలకు అప్పగిస్తే ఈ పథకం రాజకీయబంధుగా మారుతుందని ఆరోపించారు. సీఎం నిర్ణయంతో దళితబంధు నిధులను ఎమ్మెల్యేలు తమ జేబులో వేసుకునేందుకు ఉపయోగపడుతుందని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామని ప్రకటించి కేసీఆర్ మాట మార్చారని దుయ్యబట్టారు. 1100మంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణాలో ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి ఆలయం అభివృద్ధిని కాదని, యాదగిరిగుట్టలో కనీసం ఒక్క ఇల్లు కట్టావా? పొద్దున్నే లేచి దేవుడి చుట్టూ తిరిగితే సరిపోతుందా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. సీఎంగా ఉన్నన్ని రోజుల్లో గ్రామానికో కనీసం 100ఇళ్లు కట్టించాలని, ఈ సంవత్సరమైనా కేసీఆర్‌కు జ్ఞానోదయం కలిగించి పేదలకు న్యాయం చేయాలని లక్ష్మీ నరసింహస్వామిని కోరుతున్నట్టు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.