బీజేపీకి మరో షాక్..
ఆర్.బి.ఎం హైదరాబాద్: తెలంగాణ బీజేపీకి టీఆర్ఎస్ షాకిలిస్తోంది. ఇప్పటివరకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలను కమలదళంలో చేర్చుకున్నారు. అయితే ఇప్పుడు భిన్నంగా బీజేపీ నేతలను టీఆర్‌ఎస్ టార్గెన్ చేసింది. ఇటీవల హైదరాబాద్‌లో నలుగురు బీజేపీ కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ మరుసటి రోజే వరంగల్‌లో ఇద్దరు బీజేపీ నేతలు కారెక్కారు. గురువారం రాత్రి వరకు బీజేపీ కండువా కప్పుకొని, పార్టీ జాతీయ నాయకులకు ఘన స్వాగతం పలికారు. అయితే అనూహ్యంగా తెల్లారేసరికి మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
సొంత అన్నదమ్ములైన గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) బీజేపీ కార్పొరేటర్ చింతాకుల అనిల్, పార్టీ సీనియర్ నాయకుడు సునీల్ శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. గురువారం సాయంత్రం కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వరంగల్ వచ్చారు. ఆయనకు చింతాకుల సోదరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో రవిశంకర్‌తో సమావేశంలో పాల్గొన్నారు. రాత్రి వరకూ బిజీగా గడిపిన చింతాకుల సోదరులు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే నరేందర్, ఎమ్మెల్సీ బండా ప్రకాష్, ఎంపీ దయాకర్‌తో కలిసి హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. చింతాకుల సోదరులు టీఆర్‌ఎస్‌లో చేరడం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీకి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. సునీల్, అనిల్ ఏబీవీపీలో పనిచేస్తూ ఎదిగారు. నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 2019లో 27వ డివిజన్ కార్పొరేటర్‌గా అనిల్ గెలిచారు. సునీల్ గతంలో పార్టీ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేశారు.