అభివృద్దే మన నినాదం కావాలి: శ్రీకాంత్ రెడ్డి.

అభివృద్దే మన నినాదం కావాలి: శ్రీకాంత్ రెడ్డి.

  • ఆదర్శంగా మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలి
  • సమిష్టికృషి,సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కౌన్సిల్ సభ్యులు కృషి చేయాలి
  • కోవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం విజయవంతం అయ్యేలా ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలి
  • రాయచోటి మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్: అభివృద్దే మన నినాదం కావాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో ఎం ఎల్ సి జకీయా ఖానంతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ఆయా వార్డుల పరిధిలోని సమస్యలపై ఆరా తీశారు. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ బాగుకోసం కౌన్సిల్ సభ్యులు ఏకం కావాలన్నారు. కౌన్సిల్ లో ప్రతిపక్షం లేకున్నా కానీ సమస్యల పరిష్కారంలో ప్రతిపక్ష పాత్రను, అభివృద్ధిలో అధికార పక్షం పాత్రలను మనమే పోషించాలన్నారు. మున్సిపాలిటీ ఆదాయవనరులును రోజు రోజుకూ పెంపొందించు కోవాలన్నారు.మున్సిపాలిటీ పరిధిలో జరుగుచున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయించడలో భాగస్వామ్యం కావాలని సూచించారు. మదనపల్లె రహదారి, గుణ్ణికుంట్ల డబుల్ రోడ్డు, వెలిగల్లు అదనపు నీటి పథకం,పార్క్ ల అభివృద్ధి,తిరుపతి నాయుడు కాలనీ వద్ద 30 కిమీ మేర భూగర్భ డ్రైనేజీ పనులు ముమ్మరంగా జరుగుచున్నాయని వాటిని కౌన్సిల్ సభ్యులు తరచూ సందర్శిస్తూ పనులను వేగవంతం అయ్యేలా చూడాలని సూచించారు.ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం విజయవంతం అయ్యేలా ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

ఎం ఎల్ సి జకీయా ఖానం మాట్లాడుతూ అధికారుల సమన్వయంతో ముందుకుసాగి అభివృద్ధి సాధించాలన్నారు.ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలును అర్హులకు అందించేలా సభ్యులు కృషిచేయాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలపై జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.నాడు నేడు తో ప్రభుత్వ పాఠశాలలును కార్పోరేట్ కు ధీటుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు.సమిష్టి కృషితో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడుపుదామన్నారు.వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్ మాట్లాడుతూ అభివృద్దే ధ్యేయంగా కౌన్సిల్ సభ్యులు కృషిచేద్దామన్నారు. పలు సమస్యలు, అభివృద్ధి అంశాలుపై కౌన్సిలర్లు మదనమోహన్ రెడ్డి, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, కొలిమి హారూన్,గౌస్ ఖాన్, అల్తాఫ్, కసిరెడ్డి వెంకట నరసింహారెడ్డి లు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.మున్సిపల్ కమీషనర్ రాంబాబు మాట్లాడుతూ 18 ఏళ్ళు పైబడిన వారందరినీ కోవిడ్ వ్యాక్సినేషన్ వినియోగించుకునేలా సభ్యులు కృషిచేయాలన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాషా, జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏకగ్రీవంగా ముగ్గురు కో అప్షన్ సభ్యుల ఎంపిక…
రాయచోటి మున్సిపల్ పురపాలికలో ముగ్గురిని కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మైనారిటీ మహిళ క్రింద షేక్ మైమూన్, మైనారిటీజనరల్ కోటాలో కయాని ఆసీఫుల్లా ఖాన్, ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కోటా క్రింద పి.అయ్యవారు రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నికలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎం ఎల్ సి జకీయా ఖానంలు పాల్గొన్నారు.

నూతన కో అప్షన్ సభ్యులకు ఘన సన్మానం…

నూతనంగా ఎన్నికైన కో అప్షన్ సభ్యులు షేక్ మైమూన్, కయాని ఆసీఫుల్లా ఖాన్, పి అయ్యవారు రెడ్డి లను చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎం ఎల్ సి జకీయా ఖానం, మున్సిపల్ చైర్మన్ ,వైస్ చైర్మన్ లు ఫయాజ్ బాషా, ఫయాజూర్ రెహమాన్,కౌన్సిలర్లు, కమీషనర్ రాంబాబు, సిబ్బంది , ఎన్ జి ఓ సంఘ నాయకులు గజమాలలుతో, దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నూతన కో అప్షన్ సభ్యులు బాధ్యతగా పనిచేయాలన్నారు.

చీఫ్ విప్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నూతన కో అప్షన్ సభ్యులు…

చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి నూతన కో అప్షన్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తమపై ఎంతో నమ్మకం ఉంచి కో అప్షన్ సభ్యులుగా నియమించడం పట్ల పార్టీకి కృతజ్ఞులుగా వుంటామన్నారు. ఎం ఎల్ సి జకీయా ఖానం, మున్సిపల్ పాలక వర్గానికి నూతన కో అప్షన్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.