రంగారెడ్డిలో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో నకిలీ నోట్ల చెలామణి పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో జోరుగా సాగుతోంది. సాదారణ వ్యక్తుల ముసుగులో కరెన్సీ నోట్ల ముఠా సభ్యులు దర్జాగా ఫేక్ కరెన్సీని క్యాష్‌గా మార్చుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇదే విధంగా నకిలీ నోట్లను జనానికి అంటగట్టేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లిలో భారీగా ఫేక్ కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. కొందరు ముఠాగా ఏర్పడి హైదరాబాద్ శివారు ప్రాంతంలో నగదు చెలామణి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా ఐదుగురు మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇలాంటి ఘటనలు తెరపైకి రావడం రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా వ్యాపారులతో పాటు స్థానికులు ఏవి అసలు నోట్లో, ఏవి దొంగనోట్లో గుర్తు పట్టలేక మోసపోతున్నారు. నోట్ల గుర్తింపుపై అధికారులు ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. దొంగనోట్లు ఎవరైనా చలామణి చేస్తూ కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. నకిలీ నోట్ల చలామణికి పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.