స్వార్థ రాజకీయాలే చంద్రబాబు ఏజెండా.

స్వార్థ రాజకీయాలే చంద్రబాబు ఏజెండా

● *వైసిపి అధికార ప్రతినిధి ఆరె శ్యామల ధ్వజం*

ఆర్.బి.ఎం,అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం స్వార్థ రాజకీయాల కోసమే పనిచేస్తున్నారని, వైఎస్సార్‌సీపీపై బురద చల్లడమే ఆయన నిత్యకృత్యంగా మారిందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని ఆరె శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే అసాంఘిక శక్తులు విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడులకు తెగబడుతున్నారని, అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం విస్మయానికి గురిచేస్తోందని మండిపడ్డారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా దాడులు చేస్తే, భవిష్యత్తులో ప్రజలే కూటమి నాయకులకు తగిన బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనవసరపు డ్రామాకు తెరలేపిందని ఆమె విమర్శించారు. లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని నివేదికలు రావడంతో ఇప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ విషయంలో నిజాలు బయటకు రావడంతో వారు తీవ్ర అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే పవిత్రమైన తిరుమల ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగడం శోచనీయమని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *