తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి శనివారం అయ్యప్ప మాలధారణ చేశారు. ప్రగతి భవన్ నుంచి బయటకొచ్చిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో ధర్మశాస్త్ర అయ్యప్పస్వామిని దర్శించుకుని కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం రోహిత్‌రెడ్డి గురుస్వామి సమక్షంలో అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. ఆదివారం ఎమ్మెల్యే తాండూరుకు వస్తారు. మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన తర్వాత మొదటిసారి తాండూరుకు వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు. తాండూరులోని విలియం మూన్ చౌరస్తా నుంచి భద్రేశ్వరచౌక్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారు. రోహిత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ బ్యానర్లు పోటాపోటీగా కట్టారు. పోట్లి మహరాజ్ దేవస్థానంలో భోజన ఏర్పాట్లు చేశారు.