సినీ నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు షాకిచ్చింది. శనివారం విజయవాడ అదనపు జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెలా రూ.8 లక్షలు భరణం చెల్లించాలని న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని తీర్పు చెప్పారు. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ (శేషు)తో 1984లో వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ‘పృథ్వీరాజ్ విజయవాడలో మా పుట్టింట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడు. ఆ ఖర్చులన్నీ మా తల్లిదండ్రులే భరించేవారు. ఆయన నన్ను తరచూ వేధిస్తుండేవాడు. 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి గెంటివేయడంతో పుట్టింటికి వచ్చి ఉంటున్నాను’ అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నారని, అతని నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు రూ.8 లక్షలు, ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి నెలా 10వ తేదీ నాటికి భరణం చెల్లించాలని తీర్పిచ్చారు.