లఖ్‌నవూ: శిఖర్ ధావన్ సారథ్యంలో సౌతాఫ్రికా జట్టుతో మూడు వన్డేల సిరీస్ లో తొలి వన్డేను టీమిండియా ఓటమితో మొదలు పెట్టింది. సంజూ శాంసన్..(63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.. శ్రేయాస్ అయ్యర్ కూడా అర్ధసెంచరీతో పోరాడాడు. అయినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. గురువారం జరిగిన మ్యాచ్ లో 9 పరుగుల తేడాతో టీమిండియాపై సఫారీలు విజయం సాధించారు. ఈ గెలుపుతో సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. వర్షం కారణంగా రెండున్నర గంటలు ఆలస్యంగా మొదలై ఆటను 40 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (63 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 నాటౌట్), క్లాసెన్ (65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 నాటౌట్) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. డికాక్ (48) ఫర్వాలేదనిపించాడు. శార్దూల్ ఠాకూర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్ 40 ఓవర్లలో 8 వికెట్లకు 240 పరుగులు చేసి ఓడింది. శ్రేయాస్ అయ్యర్ (37 బంతుల్లో 8 ఫోర్లతో 50), శార్దూల్ ఠాకూర్ (31 బంతుల్లో 5 ఫోర్లతో 33) మాత్రమే రాణించారు. ఎన్‌గిడికి మూడు, రబాడకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా క్లాసెన్ నిలిచాడు. ఇక రెండో వన్డే ఆదివారం జరుగుతుంది.