కన్నుల పండువగా విద్యారణ్యం వేద పాఠశాల వార్షికోత్సవం

కన్నుల పండువగా విద్యారణ్యం వేద పాఠశాల వార్షికోత్సవం

 

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చిప్పలపల్లిలోని విద్యారణ్యం వేద పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే ఆడిట్ ప్రిన్సిపల్ డైరక్టర్ సుహాసిని మాట్లాడుతూ సంస్కృత భాష నేర్చుకోవడం ద్వారా జర్మన్ వంటి భాషలను సులువుగా నేర్చుకోవచ్చన్నారు. ముఖ్యంగా గణితం సులభంగా నేర్చుకునేందుకు సంస్కృత భాష ఉపయోగపడుతుందని చెప్పారు. సంస్కృతం ద్వారా హేతుబద్ధమైన ఆలోచనలు కలుగుతాయన్నారు. వేద విద్యార్ధులు చేసిన కర్రసాము, సూర్యనమస్కారాలు, యోగ వ్యాయామ ప్రదర్శనలు, ప్రసంగాలు బాగున్నాయంటూ ఆమె ప్రశంసించారు. ఎన్ని ఆదర్శాలు ఉన్నా ఆచరణలో పెట్టినప్పుడే ప్రయోజనమన్నారు. ఆ తర్వాత ప్రసంగించిన ఐఏఎస్ అధికారి శంతన్ మాట్లాడుతూ సనాతన ధర్మ విశిష్టతను వివరించారు. వేద విద్యను కాపాడుకునేందుకు విద్యారణ్యం వ్యవస్థాపకులు మాడుగుల శశిభూషణ్ శర్మ బృందం చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.

 

ముఖ్య వక్తగా విచ్చేసిన ఘనాపాఠి బ్రహ్మశ్రీ హరి సీతారామ మాట్లాడుతూ వేదాధ్యయనం ప్రాధాన్యతను వివరించారు. వేద విద్యను ఎవ్వరూ దొంగిలించలేరని, విద్య అనే సంపదను ఎంత పంచితే అంత పెరుగుతుందన్నారు.

 

 

విద్యారణ్యం వ్యవస్థాపకులు మాడుగుల శశిభూషణ్ శర్మ (99490 31733) మాట్లాడుతూ ఐదేళ్లుగా తాము చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. చిప్పలపల్లిలో ఏడెకరాల విస్తీర్ణంలో అందమైన ప్రకృతి మధ్య వేద పాఠశాల ఏర్పాటు చేశామని, మున్ముందు మరింత మంది విద్యార్ధులకు వేదం నేర్పుతామన్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్ల కోసం సమాజంలో వేద విద్యను ప్రోత్సహించాలనుకునే వారంతా సహకరించాలని కోరారు.

 

కార్యక్రమంలో విద్యార్ధుల తల్లిదండ్రులు, పలువురు విద్యావేత్తలు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

key words…. SHASIBHUSHAN SHARMVIDYARANYAM, Kandukur, chippalapally, Telanganaly, Telangana

Leave a Reply

Your email address will not be published.