నిధుల కొరత అడ్డంకిగా మారకుండా జాగ్రత్తలు:పద్మారావు గౌడ్,ఉప సభాపతి
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్, సికింద్రాబాద్ : అభివృద్ధి కార్యకలాపాలకు నిధుల కొరత అడ్డంకిగా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కార్యకలాపాలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీపీ ఫండ్స్)వినియోగం పై తీగుళ్ల పద్మారావు గౌడ్ బుధవారం సీతాఫలమండీ క్యాంపు కార్యాలయంలో ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా ప్లానింగ్ అధికారి సురేందర్, సెట్విన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల సద్వినియోగం పై అధికారులతో పద్మారావు గౌడ్ చర్చలు జరిపారు. గతంలో సైతం సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి ఎద్దడి శాశ్వత నివారణకు పవర్ బోర్ వెల్స్ ఏర్పాటు మొదలు కొని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం, నియోజకవర్గం లోని వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగల స్థానంలో కేబుల్ ఏర్పాటు, సెట్విన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి వివిధ సదుపాయాలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను సద్వినియోగం చేసుకున్నట్లు అయన తెలిపారు. మున్ముందు రోజుల్లో కూడా వివిధ సదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగించేలా ఏర్పాట్లు జరుపుతామని అధికారులు సహకరించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్బంగా సూచించారు.