క్యాబ్ డ్రైవర్లను వెంటాడుతున్న కరోనా కష్టాలు.. ఫైనాన్సర్ల వేధింపులు..

క్యాబ్ డ్రైవర్లను వెంటాడుతున్న కరోనా కష్టాలు.. ఫైనాన్సర్ల వేధింపులు..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కనికరం లేనిది కరోనా. ఎవరిని కూడా ఉపేక్షించకుండా తన పంజా విసురుతూ మానవాళి ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. చైనాలో పురుడుపోసుకొని యావత్ ప్రపంచాన్ని శాసిస్తోంది ఈ మహామ్మారి కరోనా. సామాన్య ప్రజల నుండి మొదలుకొని అపర కుబేరులవరకు ఎవరిని కూడా వదలకుండా కరోనా తన పంజాతో బలితీసుకుంటూ తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. రెక్కాడితే గాని డొక్కా నిండని పేద ప్రజలు దేశంలో ఎంతో మంది ఉన్నారు. ఈ సమయంలో కరోనా వారిని పట్టి పీడిస్తూ బలితీసుకుంటోంది. పొట్ట కూటి కోసం పని చేసుకుంటే అటు పనిచేసుకుంటే కరోనా సోకి మృత్యువాత పడుతున్నారు. రోజు దేశంలో లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాలు కరోనా ను కట్టడి చేసేందుకు ఎన్ని చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోతుంది.

క్యాబ్ డ్రైవర్ల ఆశలపై నీళ్లు చల్లిన కరోనా..

దేశంలో రాష్ట్రంలో కరోనా మహామ్మారి ఉగ్రరూపం దాల్చి తన బారిన పడేసుకుంటోంది. అయితే ఈ క్రమంలో క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి దారుణంగా మారింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా బతుకుదెరువు కోసం క్యాబ్ డ్రైవర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా క్యాబ్ లు నడుపుతున్నారు. ఈ క్రమంలో పలువురు క్యాబ్ డ్రైవర్లు కరోనా సోకి ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. కరోనా బారిన పడి రోడ్లపైనికి వస్తున్నారని పలు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశకాలను అమలులోకి తీసుకురాలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, పలు కంపెనీలు ఉంటె ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్ లో డ్రైవర్​ కం ఓనర్లుగా ఎంతో మంది పనిచేస్తూ తమ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారి ఆశలపై నేడు కరోనా మహామ్మారి నీళ్లు చల్లినట్లయింది. హైదరాబాద్ ​ పరిధిలో ఓలా, ఊబర్​ వంటి సంస్థలతో ఒప్పందాల్లో 1.25 లక్షల క్యాబ్‌లు నడుస్తున్నాయి . కాగా ఐటీ సంస్థల్లో 33 వేల క్యాబ్లు నడుస్తున్నాయి. కరోనా వ్యాప్తి అధికమవడంతో ఈ క్రమంలో వర్క్​ఫ్రం హోమ్​ఇవ్వడంతో వారు కూడా యాప్​ బేస్​డ్​ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారు. కరోనా బారిన పడిన ప్రయాణికులను తమ క్యాబ్ లలో తరలిస్తున్న క్రమంలో తాము కూడా కరోనా బారిన పడుతున్నాము అని డ్రైవర్లు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమయానికి EMI కట్టకపోవడంతో ఫైనాన్సర్ల వేధింపులు..

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ఆ ఎఫెక్ట్ క్యాబ్ ల పై కూడా పడుతోంది. ఇది వరకు ప్రయాణికులు చాల వరకు క్యాబ్ లను బుక్ చేస్కునే వారు కానీ ఇప్పుడు కరోనా కారణంగా ప్రయాణికులు కూడా తక్కువగా క్యాబ్ లలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో క్యాబ్ నిర్వాహకులకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోజుకు వెయ్యి రూపాయలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో డ్రైవర్లు నెలకు చెల్లించాల్సిన EMI లు సమయానికి చెల్లించలేక పోవడంతో ఫైనాన్సర్ల నుండి తీవ్ర వేధింపులు ఎదుర్కుంటున్నారు. కారు నడిపితేనే వారి జీవితం సజావుగా సాగుతుంది కానీ ఫైనాన్సర్ల మాత్రం డబ్బులు కట్టకపోతే కారు స్వాధీనం చేసుకుంటాం అంటూ వారిని భయాందోళనకు గురిచేస్తున్నారు.

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో బతకడమే సవాలుగా మారిందని ఈ సమయంలో ఫైనాన్సర్ల  కొంచం తమ గురుంచి ఆలోచించాలని వారు వేడుకుంటున్నారు. తమ సమస్యను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్సర్ల  నుండి ఈ విపత్కర సమయంలో కొంత ఊరట కలిగించాలని వారు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.